బాయిలర్ కోడి మాంసం అయితే, అరగంటలో ఉడికిపోతుంది. కానీ, నాటు కోడి మాంసం పేరుకు తగ్గట్టే యమా నాటు. కాబట్టి... నాటుకోడి కూర వండే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఎలాగో చూసేయండి మరి....
కావాల్సినవి
ఎముకలతో సహా నాటుకోడి - కేజీ, ధనియాలు- రెండు చెంచాలు, కొబ్బరికోరు- అర చెంచా, గసగసాలు- రెండు చెంచాలు. మసాలా కోసం: లవంగాలు, యాలకులు - రెండు చొప్పున, దాల్చిన చెక్క - చిన్న ముక్క, అల్లంవెల్లులి ముద్ద - మూడు చెంచాలు, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - అర చెంచా, కారం - మూడు చెంచాలు, ధనియాల పొడి - రెండు చెంచాలు, గరం మసాలా పొడి - అర చెంచా, టొమాటోలు - రెండు(సన్నగా తరగాలి), నూనె - అరకప్పు, పచ్చిమిర్చి - ఎనిమిది, ఉల్లిపాయలు - మూడు, కరివేపాకు - ఐదు రెబ్బలు.
తయారీ
నాటుకోడిని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కొట్టి పెట్టుకోవాలి. ధనియాలూ, గసగసాలను దోరగా వేయించి పొడి కొట్టుకోవాలి. దీనికి కొబ్బరికోరుని కూడా కలిపి కాసిని నీళ్లు చల్లి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి.. నూనె వేడిచేయాలి. అందులో లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, అల్లంవెల్లుల్లిముద్ద వేయించాలి. రెండు మూడు నిమిషాలయ్యాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు, పసుపూ, కారం, ధనియాల పొడి, టొమాటో ముక్కలు, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఆపై కావాల్సినన్ని నీళ్లు వేసి ఇరవైనిమిషాల పాటూ మూతపెట్టి ఉడికించుకోవాలి. దీనిపై గసగసాల ముద్ద వేసి తక్కువ మంటమీద ఉడికించుకుని దింపేయాలి.
ఇదీ చదవండి:కిచెన్ మైదానంలో 'కేక్ బాల్స్' చేసేద్దామా?