తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆకలి బాధల అంతమే అంతిమ లక్ష్యం

ఓ వైపు వ్యవసాయ ఉత్పతుల్లో అధిక దిగుబడుల కారణంగా గిడ్డంగుల్లో ధాన్యాలు మూలుగుతున్నాయి. మరోవైపు ఆకలి బాధలకు, పౌష్టికాహార లోపానికి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లోపభూయిష్ఠమైన ప్రజా పంపిణీ వ్యవస్థ అందుకు మూల కారణంగా నిలుస్తోంది. నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా అందరి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు పక్కా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం
WORLD FOOD SAFETY DAY

By

Published : Jun 7, 2021, 7:07 AM IST

ఆధునిక సమాజం శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించినా, పేదరికాన్ని నిర్మూలించడంలో మాత్రం వెనకబడే ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను ఆహార కొరత, పౌష్టికాహార లోపం తీవ్రంగా పట్టి పీడిస్తున్నాయి. ఐరోపా, చైనా, భారత్‌ వంటి దేశాలు ఆర్థిక, సాంకేతిక, వ్యవసాయ ఉత్పత్తుల్లో అధిక దిగుబడిని సాధించి మిగులు ఆహార ధాన్యాలను గిడ్డంగుల్లో నిల్వ ఉంచడమే కాకుండా, సముద్రాల్లో పారవేసిన ఉదంతాలూ ఉన్నాయి. మరోవైపు రెండు పూటలా తిండి గడవని పేద కుటుంబాలూ ఈ దేశాల్లో కోట్ల సంఖ్యలో ఉన్నాయి. భారత్‌లో వలస కార్మికులు, ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వర్గాలు, ఆదివాసులు, గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని నిరుపేదలకు ఆహార భద్రత కొరవడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఏటా పౌష్టికాహారం లోపించి సుమారు నాలుగు లక్షల ఇరవై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కోట్లాది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

'నేటి సురక్షిత ఆహారమే రేపటి ఆరోగ్యం'

ఐక్యరాజ్యసమితి చెప్పినట్లు- ప్రతి మనిషికీ ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన సురక్షిత ఆహారాన్ని అందుబాటులో ఉంచడమే 'ఆహార భద్రత'. ఈ బృహత్‌ సంకల్పంతో ఐరాస 2019లో మొదటిసారిగా 'ఫ్యూచర్‌ ఆఫ్‌ ఫుడ్‌ సేఫ్టీ' అనే నినాదంతో జెనీవాలోని అడిస్‌ అబాబాలో సదస్సు నిర్వహించింది. ఆహార భద్రతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించాలని పిలుపిచ్చింది. అప్పటి నుంచి జూన్‌ ఏడో తేదీని ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార-వ్యవసాయ సంస్థలు ఇందుకు సహకారం అందిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌ ఏడో తేదీన (సోమవారం) మూడో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని 'నేటి సురక్షిత ఆహారమే రేపటి ఆరోగ్యం' అనే నినాదంతో నిర్వహిస్తున్నారు. 2030 నాటికి ఆకలి సమస్యను అంతమొందించాలనేది ఐక్యరాజ్య సమితి సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగం. రైతు పొలంలో పండించే ప్రతి గింజా పేదవాడి నోటికి చేరినప్పుడే 'జీరో హంగర్‌' సాధనకు మార్గం సుగమమవుతుంది.

ఆహార కొరత..

అధిక జనాభా, ఆర్థిక వ్యవసాయ రంగాల్లో సంక్షోభం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, లోపభూయిష్ఠమైన ప్రజాపంపిణీ వ్యవస్థ వంటివి ఆహార కొరతకు కారణమవుతున్నాయి. ఒకవైపు పంట పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంలేదు. మరోవైపు అధిక ధరలతో సగటు వినియోగదారులకూ ఆహార వ్యయం భారమవుతోంది. ఆఫ్రికా, మధ్య ఆసియాలో విద్యార్థులు తీవ్ర ఆకలి సమస్యలు ఎదుర్కొంటున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ తాజా నివేదిక ప్రకారం సుమారు 13 నుంచి 26 కోట్ల మంది ప్రజలు ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. మడగాస్కర్‌, కామెరూన్‌, సోమాలియా, దక్షిణ సూడాన్‌, కాంగో, సిరియా, యెమెన్‌తో పాటు 37 దేశాల్లో ఆహార కొరత, ఆకలి సమస్యలు ఉన్నాయి. అందులో 107 దేశాల ఆకలి సూచీలో మన దేశం 94వ స్థానంలో ఉంది.

అందరికీ భద్రత..

భారత్‌లో ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించాలని రాజ్యాంగం విస్పష్టంగా చెబుతోంది. హరిత, శ్వేత, నీలి విప్లవాలు దేశానికి చాలావరకు ఆహార భద్రతను కల్పించాయి. కేంద్ర ప్రభుత్వం- పేదవారు దేశంలో ఎక్కడ ఉన్నా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు పొందే విధంగా 'ఒకే దేశం, ఒకే రేషన్‌' విధానాన్ని రూపొందించింది. ఎన్ని చేసినా దురదృష్టవశాత్తు అందరికీ నిత్యావసరాలు చేరడంలేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం, మహిళా శిశు సంక్షేమం, ఉపాధి హామీ వంటి పథకాల్లో లోపాలను సరిదిద్దాలి. లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ, అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ వంటి పథకాలతో దారిద్య్ర రేఖ దిగువన ఉన్న వారందరికీ ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలి. కరోనా విజృంభణతో విపత్కర పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో చాలామంది వలస కార్మికులు, నిరుపేదలు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు. కనీసం మహమ్మారులు దాడి చేసినప్పుడు నిరుపేద ప్రజలు ఇక్కట్ల పాలు కాకుండా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి దేశంలో వ్యవసాయ ఉత్పత్తులను, ఆహార నిల్వలు పెంచడం సహా అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. ప్రతి వ్యక్తీ తన అవసరాలను తీర్చుకునేలా సురక్షిత పౌష్టికాహారాన్ని కొనుగోలు చేసే శక్తి కలిగి ఉండాలి. దానివల్ల మానవ వనరులు, అంతిమంగా దేశం పురోభివృద్ధి సాధిస్తాయి.

- డాక్టర్‌ రావుల కృష్ణ (హెచ్‌సీయూ విద్యావిభాగంలో సహాయ ఆచార్యులు)

ఇదీ చూడండి:వారికి రేషన్​ కార్డులు అందేలా చూడండి : కేంద్రం

ABOUT THE AUTHOR

...view details