తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆరోగ్య రంగానికి కరోనా నేర్పిన పాఠాలివే... - కరోనా జాగ్రత్తలు

దేశ ఆరోగ్య వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో మహమ్మారి కరోనా విరుచుకుపడటంతో మరోసారి తేటతెల్లమైంది. కరోనా తీవ్రమైతే ఇప్పుడున్న వాటికన్నా 80 రెట్లు అధికంగా వెంటిలేటర్లను సమకూర్చుకోవాల్సి ఉంటుందని, 3.8 కోట్ల మాస్కులు, 62 లక్షల వ్యక్తిగత రక్షణ పరికరాలు అవసరమవుతాయని అంతర్జాతీయ అధ్యయన నివేదికలు పేర్కొన్నాయి.

The corona pandemic can be damaging to health as well as financially.
ఆరోగ్య అవ్యవస్థ!.. కరోనా - గుణపాఠాలు

By

Published : Apr 22, 2020, 1:12 PM IST

దేశంలోని వివిధ ప్రైవేటు సంస్థలు వెంటిలేటర్లు, మాస్కులను ఉత్పత్తి చేసేందుకు ముందుకు వస్తున్నాయి. రూర్కీలోని ఐఐటీ సంస్థ అతి తక్కువ ఖర్చుతో పోర్టబుల్‌ వెంటిలేటర్ల నమూనా తయారు చేసింది. భారతీయ రైల్వే శాఖ కరోనా అనుమానితుల చికిత్స కోసం 20వేల కోచ్‌లను సిద్ధం చేస్తోంది. కేరళకు చెందిన ఓ సంస్థ రైల్వే కోచ్‌లను సంచార వైద్యశాలలుగా మార్చి దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 7,300 రైల్వే స్టేషన్లలో ప్రజలకు వాటిని అందుబాటులో ఉండేలా చేస్తామని కేంద్రానికి ఓ ప్రణాళిక సమర్పించింది. దేశవ్యాప్తంగా జన సంచారాన్ని గుర్తించి నియంత్రించేందుకు, మందుల సరఫరాకు డ్రోన్‌ పరికరాలతో సేవలు అందించేందుకు అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. మరోవంక దేశంలోని ప్రముఖ కార్పొరెట్‌ సంస్థలు భూరి విరాళాలు ప్రకటించాయి. ఈ పరిణామాలనుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

వైద్యానికే అధికం

దేశ ప్రజలు ఏటా చేస్తున్న ఆరోగ్య వ్యయంలో రోగ నిరోధక చికిత్సకోసం 9.6 శాతం వెచ్చిస్తుండగా- దాదాపు 90.4శాతం (రూ.3.6 లక్షల కోట్లు) రోగ చికిత్సకోసం ఖర్చు చేస్తున్నారు. తప్పనిసరి వైద్య ఖర్చులు తడిసిమోపెడవుతున్నందువల్ల దేశ ప్రజలు క్రమంగా దారిద్య్ర రేఖ దిగువకు జారిపోతున్నారు. ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్లో కేవలం 30శాతం మాత్రమే ప్రాథమిక చికిత్సకోసం వినియోగిస్తున్నారు. 135 కోట్ల జనాభాలో 27శాతానికే ఆరోగ్య బీమా సౌకర్యం ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారత్‌లో 46.9 కోట్ల మందికి అత్యవసర మందులు అందుబాటులో లేవు. ఆరోగ్యం కోసం దేశంలోని దిగువ మధ్య తరగతి కుటుంబాలు పెట్టే ఖర్చులో దాదాపు 70శాతం మందులకోసమే వ్యయమవుతోంది. ఇన్ని సమస్యల నడుమ భారత ఆరోగ్య రంగం ఏటా సగటున 16-17 శాతం వృద్ధి చెందుతూ 2022 నాటికి రూ.8.6 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని నిపుణుల అంచనా. దేశంలోని వైద్య రంగం 2000-2019 మధ్యకాలంలో 634 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగింది. దేశవ్యాప్తంగా ప్రాథమిక స్థాయి వైద్య వ్యవస్థలను పటిష్ఠంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వైద్య సౌకర్యాల విస్తరణ, సిబ్బంది నియామకాలు అత్యంత కీలకం. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థల వైఫల్యాలను, లోటుపాట్లను కళ్లకు కట్టింది.

స్థానిక విద్యార్థులకు అవకాశం ఇవ్వాలి

దేశంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాలను స్థాపించి, అందులో చదువుకునే అవకాశం అర్హతగల స్థానిక విద్యార్థులకు కల్పించాలి. వారు ఉతీర్ణులైన తరవాత అదే జిల్లాలో వైద్యులుగా పనిచేసే నిబంధన విధించాలి. ప్రభుత్వం, ప్రైవేటు వైద్యశాలలు, ఆరోగ్య బీమా సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థలను పటిష్ఠంగా తీర్చిదిద్దాలి. దేశంలోని పౌరులందరికీ ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలి. ఈ బీమా పథకంలో సంపూర్ణ ఆరోగ్య పరీక్షలకు అవకాశం కల్పించాలి. తద్వారా రోగ నిరోధక చికిత్సపై దృష్టి పెట్టవచ్చు. దానివల్ల వ్యాధుల పాలబడ్డాక చేసే భారీ వ్యయానికి కోత కోయవచ్చు.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి.

అదే సమయంలో ఉన్నత న్యాయ స్థానం తీర్పునకు అనుగుణంగా పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తపడాలి. ఆరోగ్య రంగంలో ప్రభుత్వం వెచ్చించే నిధులను పూర్తిగా వైద్య రంగ మౌలిక సదుపాయాల విస్తరణకు, పేద ప్రజల ఆరోగ్య బీమా వ్యయానికి పరిమితం చేయాలి. రాజ్యాంగ సవరణ ద్వారా ఆరోగ్య రంగాన్ని రాష్ట్రాల జాబితానుంచి ఉమ్మడి జాబితా(రాష్ట్రాలు, కేంద్రం)లోకి మార్చాలి. మందులతో పాటు వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలనూ ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలి. కరోనా అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుని ప్రభుత్వాలు ఇకమీదటైనా ఆరోగ్య రంగంలో దీర్ఘకాలిక మార్పులకు సమకట్టాలి.

ఇదీ చదవండి:కేంద్రం ఆరోపణలు అవాస్తవం: బంగాల్​ సర్కార్​

ABOUT THE AUTHOR

...view details