ఎప్పటిలాగే ఈ ఏడాదీ అక్టోబరు 17న అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినం జరుపుకొంటున్నాం. 'దారిద్య్రాన్ని రూపుమాపడానికి సమష్టి కృషి, ప్రజా సంక్షేమ సాధన, అభివృద్ధి, భూమండల పరిరక్షణకు అంకితం కావడం'- ఈ ఏడాది నినాదం. కొవిడ్ మహమ్మారి ఇప్పటిదాకా దేశదేశాల్లో 50 లక్షల మందిని బలిగొని, దారిద్య్ర నిర్మూలనలో దశాబ్దాల ప్రగతిని వెనక్కు నెట్టింది. కరోనా వల్ల ప్రపంచమంతటా 7.1 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రజలు దారిద్య్రంలోకి జారిపోతున్నారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇప్పటికే పేదల సంఖ్య అధికంగా ఉన్న దక్షిణాసియా, సహారా ఎడారి దిగువ దేశాల్లో కటిక పేదరికం పెరుగుతోందని పేర్కొంది. కొవిడ్ కారణంగా కొత్తగా పేదరికంలోకి జారిపోయిన వారి సంఖ్య ఈ ఏడాది 16.3 కోట్ల దాకా పెరగనుంది. ఇప్పటికే కటిక పేదరికంలో మగ్గుతున్న 130 కోట్ల మందికి వీరు అదనం. పేదరికాన్ని తగ్గించి, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి సాధనకు భారత్ ముమ్మరంగా కృషి చేయాలి. ఇండియాలో 91శాతం ఉపాధి అసంఘటిత రంగంలోనే లభిస్తోంది. కొవిడ్ కాలంలో ఈ రంగంలోని వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు కుదేలై లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. కొవిడ్‌వల్ల ఈ ఏడాది అదనంగా 23 కోట్ల మంది పేదరికంలోకి వెళ్ళిపోతారని అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం మదింపువేసింది. 93శాతం కుటుంబాలు ఆదాయ నష్టం చవిచూశాయని సీఎంఐఈ సంస్థ సర్వే నిర్ధారించింది. భారత్‌లో కొవిడ్‌కు ముందే ఎక్కువగా ఉన్న పేదరికం వైరస్ కాలంలో తీవ్రమైంది.
అరకొర ఆదాయం
దారిద్య్ర నిర్మూలనలో చైనా, వియత్నామ్‌ల విజయాల నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. 1978లో చైనాలో 80శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం, ప్రస్తుతం అయిదు శాతానికి తగ్గింది. వియత్నామ్‌లో 1992లో 58శాతంగా ఉన్న గ్రామీణ పేదరికం, 2016నాటికి 7.6శాతానికి దిగివచ్చింది. మొదట సాగుకు ప్రాధాన్యమిచ్చిన చైనా, తరవాత వ్యవసాయం నుంచి పరిశ్రమలకు పెద్దయెత్తున మానవ శక్తిని తరలించి ఆదాయ వృద్ధి సాధించింది. వియత్నాం సైతం అదే బాటలో నడిచింది. సోషలిస్టు మార్కెట్ వ్యవస్థను ఏర్పరచి ప్రజల్లో వ్యవస్థాపక సామర్థ్యానికి అనువైన వాతావరణం కల్పించింది. ఆర్థిక సంస్కరణలు తెచ్చి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచింది. తమ ప్రజలకు ఆధునిక నైపుణ్యాలు అలవరచి, ఎగుమతులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోగలిగింది. భారత్ సైతం పేదరిక నిర్మూలనకు సరైన వ్యూహాన్ని అనుసరించాలి. దేశంలో మొత్తం గ్రామీణ ఆదాయంలో వ్యవసాయం వాటా 2003లో 46శాతం; అది 2018-19లో 37శాతానికి తగ్గిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తాజా నివేదిక వెల్లడించింది. ఆ సంవత్సరం వ్యవసాయ కుటుంబాల మొత్తం ఆదాయంలో వేతన వాటా పెరిగింది. అంటే, గ్రామాల్లో పోనుపోను అనేకమంది రైతులు వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారని అర్థం. 2013 నుంచి 2018 వరకు ఆరేళ్లలో రైతుల ఆదాయం ఏటా 3.5శాతం చొప్పున పెరిగిందని ఎన్‌ఎస్‌ఓ తెలిపింది. రైతుల ఆదాయాలు రెట్టింపు కావాలంటే వారి వార్షిక రాబడి ఏటా 10శాతం మించి పెరగాలి. 2018-19లో రైతులకు వ్యవసాయం ద్వారా లభించిన సగటు ఆదాయం రోజుకు రూ.127కు మించలేదు. సేద్యంతోపాటు కూలి పనులు, పాడి, కోళ్ల పెంపకం, వ్యవసాయేతర ఉపాధులను కలుపుకొన్నా- రైతు దినసరి ఆదాయం రోజుకు రూ.341 మించదు.
నైపుణ్యాలు నేర్పాలి...