బడిఈడు పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న సదుద్దేశంతో మొదలైన మధ్యాహ్నభోజన పథకం దేశంలో సుమారు పాతికేళ్లుగా అమలవుతోంది. తాజాగా 2026 సంవత్సరం వరకు పథకం గడువును పెంచిన కేంద్రం, 'పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్'గా(PM Poshan Scheme) పేరు మార్చింది. దేశవ్యాప్తంగా 11.20 లక్షల ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 11.80కోట్ల మంది ఆకలి తీర్చడానికి ఉద్దేశించిన విశిష్ట పథకమిది. ఇప్పటివరకు 1-8 తరగతులకు వర్తింపజేసిన మధ్యాహ్న భోజన వడ్డనను వచ్చే ఏడాది నుంచి పూర్వ ప్రాథమిక, బాలవాటికల విద్యార్థులకూ విస్తరింపజేయాలన్నది భేషైన యోచన. అందుకోసం అయిదేళ్లలో కేంద్రం రూ.54వేలకోట్ల మేర, రాష్ట్రప్రభుత్వాలు రమారమి రూ.32వేలకోట్ల దాకా ఖర్చు చేయాలన్నది అధికారిక నిర్ణయం. ఆహార ధాన్యాలకై కేంద్రం అదనంగా రూ.45వేలకోట్లు వెచ్చించనుందంటున్నారు. వాస్తవానికిది వ్యయం కాదు, రేపటితరం అభ్యున్నతిని లక్షిస్తున్న పెట్టుబడి!
దేశమంతటా అన్ని జిల్లాల్లో పోషణ్‌శక్తి నిర్మాణ్ పథకానికి సామాజిక ఆడిట్‌ను తప్పనిసరి చేయడం స్వాగతించదగింది. కొవిడ్ విజృంభణకు ముందే దేశంలో విటమిన్లు, ధాతులోపాలతో పిల్లలెందరో గిడసబారిపోతున్నట్లు ముప్ఫై రాష్ట్రాల్లో సేకరించిన నమూనాలు తెలియజెప్పాయి. రక్తహీనత సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లోని పిల్లలకు అనుబంధ పోషకాలు సమకూర్చాలంటున్న కేంద్రం, పౌష్టికాహార లోపాల పరిహరణపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరచడం అత్యంత ఆవశ్యకం. స్థానిక సంప్రదాయ వంటకాల్ని ప్రోత్సహించడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు పథకం అమలులో భాగస్వామ్యం కల్పించడం ఉభయ తారకమయ్యేలా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. సుప్రీంకోర్టు లోగడ చెప్పినట్లు- బడిఈడు పిల్లలకు మధ్యాహ్న భోజనం చట్టబద్ధ హక్కు. అమలులో ఆ స్ఫూర్తి ఎక్కడా దెబ్బతినకుండా కాచుకోవడం ప్రభుత్వాల వంతు!
ప్రపంచంలో ఇంత పెద్దయెత్తున మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు జరుపుతున్నది ఇండియాయేనని ఐఎఫ్‌డీఆర్‌ఐ(అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ) రెండు నెలల క్రితం ప్రస్తుతించింది. బడి మానెయ్యకుండా విద్యార్జన కొనసాగించడానికి, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు అది దోహదపడుతున్నట్లూ ప్రశంసించింది. వివిధ ఆర్థికవేత్తలు, పోషకాహార నిపుణులు కలిసి 23 ఏళ్ల పాటు సాగించిన ఆ సుదీర్ఘ అధ్యయనం- ఒక తరానికి అమ్మలాగా కడుపునింపిన పథకం, తరవాతి తరం శిశువుల అభ్యున్నతికీ బాటలు పరుస్తున్నట్లు విశ్లేషించింది. పథకమెంత సమున్నతమైనదైనా- ఇంతటి సువిశాల దేశంలో అమలు పరంగా కొన్ని పొరపాట్లు చోటుచేసుకోవడం, వాటిపై ఆరోపణలు రావడం సహజమే.
పాఠశాల దశలో మధ్యాహ్న భోజనం ఆరగించినవారి సంతానంలో ఎదుగుదల లోపాలు గణనీయంగా తగ్గుతున్నట్లు రుజువవుతున్నప్పుడు- మరెందరికో ప్రయోజనకరమయ్యేలా పథకం అమలును ఉరకలెత్తించాల్సిందే. పర్యవేక్షణ లోపాలు, మొక్కుబడి తనిఖీల కారణంగా పథకం మౌలిక స్ఫూర్తి దెబ్బ తింటున్నదని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదిక తప్పు పట్టిన సందర్భాలున్నాయి. నెలల తరబడి చెల్లింపులు జరగక, సర్కారీ ధరలు గిట్టుబాటు కావడం లేదని మొత్తుకున్నా ఎవరూ పట్టించుకొనక భోజన తయారీ ఏజెన్సీలు చేతులెత్తేస్తున్న ఉదంతాలూ ఎన్నో! అటువంటి సమస్యల్ని చురుగ్గా సామరస్యంగా పరిష్కరించడంతోపాటు, చిరుధాన్యాలతో తయారు చేసే ఆహారం పిల్లలకు అమితంగా ఉపయుక్తం అవుతుందన్న పరిశోధనల ఫలితాల్నీ ప్రభుత్వాలు లోతుగా పరిశీలించాలి. ఈ బృహత్ యజ్ఞం వచ్చే అయిదేళ్లకే పరిమితం కాకూడదు. భావి తరాల్లో పోషకాహార లోపాల్ని తరిమికొట్టాల్సిన అవసరం ఉన్నంత కాలం- బడి ఈడు పిల్లల్ని భద్రంగా సంరక్షించుకునేలా విస్తార సంక్షేమ వ్యూహాలు కొనసాగాలి!
ఇదీ చూడండి:స్వచ్ఛ భారత్ మిషన్ రెండో విడత ప్రారంభించనున్న మోదీ