తెలంగాణ

telangana

ETV Bharat / opinion

చైనాతో కలిసి పాకిస్థాన్​ 'కూటనీతి'

ప్రపంచ సూపర్‌పవర్‌గా తమ దేశానికి కొత్త శక్తినివ్వాలని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​.. 'బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్' (బీఆర్‌ఐ) ప్రాజెక్టును నిర్మించాలని కలలుగన్నారు. అయితే చైనా ఆక్రమణ కాంక్షల పట్ల అవగాహన ఉన్న భారత్​.. ఆ ప్రతిపాదనకు మద్దతివ్వలేదు. ఈ నేపథ్యంలో భారత సరిహద్దుల్లోకి చొరబడి మన ప్రాంతంలో తిష్ఠవేసేందుకు మోసకారి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు పాకిస్థాన్​ తన వంతు సహాయం చేస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారత్​కు అందుతున్న మద్దతు చూసి చైనా- పాక్​ మిత్రదేశాలు ఖంగుతిన్నాయి. వారి ప్రణాళికలు బెడిసికొట్టాయి.

Pakistan desperate to help China against India back lashed
చైనాతో కలిసి పాకిస్థాన్​ 'కూటనీతి'

By

Published : Aug 27, 2020, 7:31 AM IST

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన చైనాలో దుందుడుకుతనం మరింత పెరిగింది. ఇప్పటికే అంతర్జాతీయ తయారీరంగ కార్ఖానాగా చైనాను తీర్చిదిద్దిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌- ప్రపంచ సూపర్‌పవర్‌గా తమ దేశానికి కొత్త శక్తినివ్వాలని తహతహలాడుతున్నారు. ఆ క్రమంలోనే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, పశ్చిమాసియాల మీదుగా అమెరికా వరకూ 'బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్' (బీఆర్‌ఐ) ప్రాజెక్టును నిర్మించాలని కలలుగన్నారు. చైనా ఆక్రమణ కాంక్షలపట్ల పూర్తి అవగాహన ఉన్న ఇండియా, ఆ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా నిరాకరించడంతో జిన్‌పింగ్‌ నివ్వెరపోయారు. రకరకాల మాయోపాయాలతో శ్రీలంకలోని హంబన్‌టొట రేవును, పాకిస్థాన్‌లోని గ్వదర్‌ను చైనా ఏ రకంగా గుప్పిట పట్టిందో అందరికీ తెలుసు. చైనా నుంచి తలెత్తే సమస్యలపట్ల అవగాహన కలిగిన భారత్‌- ప్రత్యామ్నాయ వ్యూహాలతో ముందుకొచ్చింది. తైవాన్‌ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి అంతర్జాల సమావేశం ద్వారా ఈ ఏడాది మేలో ప్రధాని మోదీ హాజరయ్యారు. జీ-7 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నుంచి భారత్‌కు ఆహ్వానం లభించింది. చైనాతో తలెత్తిన వివాదంలో భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు అమెరికా దాదాపుగా సంసిద్ధత వ్యక్తపరచింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌తో ప్రధాని మోదీ ఈ జూన్‌లో అంతర్జాల సదస్సు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. కొవిడ్‌ నేపథ్యంలో చైనా-ఆస్ట్రేలియాల సంబంధాలు క్షీణించాయి. వైరస్‌ విస్తృతికి కారణమైన చైనా ఆ మేరకు పరిహారం చెల్లించాల్సిందేనని ఆస్ట్రేలియా గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌ క్రమంగా అమెరికావైపు మొగ్గుచూపుతోందని చైనా భావిస్తోంది.

బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా, సైనికపరంగానూ తన శక్తి సామర్థ్యాలను చాటుకోవాలనే ఉద్దేశంతో దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఇష్టారీతిన వ్యవహరిస్తోంది. వియత్నాం, తైవాన్‌, జపాన్‌లను బెదిరిస్తోంది. భారత సరిహద్దుల్లోకి చొరబడి మన ప్రాంతంలో తిష్ఠవేసేందుకు మోసకారి ప్రయత్నాలు చేస్తోంది. సంక్షోభాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ఇరుపక్షాలకు చెందిన బృందాలు అనేక సందర్భాల్లో చర్చించినా చైనా మొండిగానే వ్యవహరించింది. మరోవంక ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవాలని దాయాది దేశం పాకిస్థాన్‌ మనదేశ పశ్చిమ సరిహద్దుల్లో కుట్రలకు తెగబడుతోంది. కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని డ్రోన్‌ సాయంతో సరఫరా చేసేందుకు పాక్‌ కావించిన ప్రయత్నాలను జూన్‌లో భారత దళాలు తిప్పికొట్టి, డ్రోన్‌ను నేలకూల్చాయి. జూన్‌లోనే సుమారు 150 పర్యాయాలు పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. భారత్‌కు చెందిన జమ్ము, కశ్మీర్‌లను; గుజరాత్‌లోని జునాగఢ్‌ ప్రాంతాన్ని తమ భూభాగాలుగా చూపుతూ ఆగస్టు నాలుగున పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అధికారికంగా ఓ పటాన్ని విడుదల చేసి తన బరితెగింపు చాటుకున్నారు. జమ్మూ కశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కల్పించిన 370 అధికరణను భారత ప్రభుత్వం రద్దుపరచి ఆగస్టు అయిదునాటికి ఏడాది కాగా- అందుకు సరిగ్గా ఒక రోజు ముందు పాకిస్థాన్‌ ఈ మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం. ఆ మ్యాప్‌ను తమ దేశ స్కూలు పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చనున్నట్లూ అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. జైషే మహమ్మద్‌, లష్కరే తొయిబా వంటి ఉగ్రసంస్థలను ఎగదోసి ఆగస్టు అయిదున దాడులకు పాల్పడేందుకు పాక్‌ చేసిన ప్రయత్నాలను భారత భద్రతాదళాలు తిప్పికొట్టాయి. పాకిస్థాన్‌ బాటలోనే చైనా ప్రేరేపిత నేపాల్‌ సైతం లింపియదుర, లిపులేక్‌, కాలాపానీ వంటి భారతీయ భూభాగాలను తమవిగా చెప్పుకొంటూ పటాలను విడుదల చేసింది. పాక్‌ పటంలో షక్స్‌గమ్‌ లోయ, అక్సయ్‌ చిన్‌ ప్రాంతాలను చైనాకు చెందినవిగా చూపారు.

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న పాకిస్థాన్‌- సౌదీ అరేబియా, యూఏఈ, చైనా, ఐఎమ్‌ఎఫ్‌లు ఇస్తున్న రుణాల సాయంతో బతుకు నెట్టుకొస్తోంది. ఐఎమ్‌ఎఫ్‌ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడం, ఉగ్రవాదులకు మద్దతుగా నిలవడం వంటి కారణాలవల్ల పాకిస్థాన్‌ 'ఎఫ్‌ఏటీఎఫ్' నిషేధిత జాబితాలో చేరింది. ఉగ్రవాదులకు సాయం నిలిపివేయకపోతే పాక్‌ను 'బ్లాక్‌ లిస్ట్‌'లో చేరుస్తామనీ హెచ్చరిస్తున్నారు. ఆక్రమణ కాంక్షలతో చెలరేగుతున్న చైనా... భవిష్యత్తులో పాకిస్థాన్‌ తాను తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేని పక్షంలో- ఆ దేశంలోని గ్వదర్‌ రేవును, బలూచిస్థాన్‌లోని ఖనిజ వనరులను; గిల్గిట్‌ బాల్టిస్థాన్‌లలోని వ్యవసాయానుకూలమైన సారవంతమైన భూములను తన స్వాధీనంలోకి తీసుకునే అవకాశాలు కొట్టిపారేయలేనివి. తూర్పు సరిహద్దుల్లో చైనా తాకిడికి భారత్‌ బెంబేలెత్తిపోతుందని; అన్ని రకాలుగా రాజీకి వస్తుందని బీజింగ్‌, ఇస్లామాబాద్‌ నాయకత్వాలు తలపోశాయి. కానీ- చైనాకు భారత్‌ ఇచ్చిన జవాబు ఆ దేశాలకు నోటమాట రాకుండా చేసింది. మరోవంక అమెరికా, వియత్నాం, జపాన్‌, ఆస్ట్రేలియా, యూకే, తైవాన్‌ సహా అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా ముందుకొచ్చాయి. భారత్‌కు ఈ స్థాయిలో మద్దతు లభిస్తుందన్న విషయాన్ని చైనా, పాక్‌లు ఊహించలేకపోయాయి. అధికరణ 370 రద్దు తరవాత భారత్‌కు గట్టి జవాబు చెప్పాలని ఉవ్విళ్లూరిన పాకిస్థాన్‌కు తాజా పరిణామాలు నిరాశ కలిగించాయి. భారత, అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని తహతహలాడుతున్న పాకిస్థాన్‌ ఈ ఎదురుదెబ్బల నేపథ్యంలోనైనా తన ప్రయత్నాలకు స్వస్తిపలికి- తమ దేశంలోని బలూచిస్థాన్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వేర్పాటువాద ఉద్యమాన్ని; బలూచ్‌లతో సింధీ జాతీయవాదులు చేతులు కలిపి సృష్టిస్తున్న గందరగోళాన్ని ఎదుర్కోవడంపై దృష్టి పెడితే మేలు!

- జై కుమార్‌ వర్మ

(రచయిత- రక్షణరంగ నిపుణులు)

ABOUT THE AUTHOR

...view details