ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల జలుబు, జ్వరంవంటి వాటి బారిన పడుతున్న వారు దాదాపు అన్ని ఇళ్లలో ఉంటున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటివి రాగానే నేరుగా మందుల దుకాణానికి వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోవడం ఇటీవలి కాలంలో మామూలైపోయింది. ఇలా ఇష్టారాజ్యంగా వాడితే యాంటీబయాటిక్స్ అసలు పనిచేయడమే మానేస్తాయని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సమర్థ చికిత్స అందించడానికి కనుగొన్న దివ్య ఔషధాలే యాంటీబయాటిక్స్. కొన్నిరకాల వ్యాధుల వల్ల వచ్చే తీవ్రమైన దుష్ఫలితాలను తగ్గించడంలో ఇవి సమర్థంగా పనిచేస్తాయి. ప్రస్తుతం కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయడం లేదు. దీన్నే వైద్య పరిభాషలో యాంటీబయాటిక్ నిరోధకత అంటున్నారు.
బ్యాక్టీరియా వృద్ధికి ఆస్కారం..
యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడటమే దీనికి ప్రధాన కారణం.అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్‌ను వాడటం వల్ల వాటికి లొంగని బ్యాక్టీరియా ఇంకా వృద్ధిచెందుతోంది. ఆ నిరోధక లక్షణాలు ఇతర సూక్ష్మజీవులకూ అందే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యాంటీబయాటిక్స్ వాడుతున్న ప్రజల్లో మూడోవంతుకు అవి అవసరం లేదన్నది అమెరికా వ్యాధి నియంత్రణ, నిరోధక కేంద్రం మాట. బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను మాత్రమే యాంటీబయాటిక్స్ తగ్గిస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్లకు అవి పనికిరావు. జలుబు, ఫ్లూ వంటి వాటికి అసలు యాంటీబయాటిక్స్ అవసరం లేదన్నది వైద్య నిపుణుల మాట. వైరల్ ఇన్ఫెక్షన్లకూ వాటిని వాడటం వల్ల అవి తగ్గకపోగా, ఇతర దుష్ప్రభావాలు సైతం తలెత్తే ప్రమాదముంది. భారత్‌లో అక్టోబరు నుంచి ఫిబ్రవరి వరకు ఇన్‌ఫ్లూయెంజా, ఇతర వైరస్‌ల కారణంగా జలుబు, దగ్గు ఎక్కువగానే వస్తుంటాయి. చాలామంది నేరుగా మందుల దుకాణానికి వెళ్ళి, తమకు తెలిసిన యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారు. ఈ రుగ్మతలకు పెద్దగా మందులు వాడకపోయినా ఒకటి లేదా రెండు వారాల్లో అందరూ కోలుకొంటారు. అంతకుమించి జ్వరం కొనసాగినా, మరీ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా అప్పుడు మాత్రమే, అదీ వైద్యులు చెప్పినట్లుగా ఔషధాలు వాడాలి.