ప్రపంచీకరణ నేపథ్యంలో నగరాలు, పట్టణాలు దేశార్థికానికి చోదక శక్తులుగా అవతరించాయి. ఉపాధి అవకాశాలకు ప్రధాన కేంద్రాలై- పోనుపోను ఇంతలంతలవుతున్న వలసలతో అవి కిక్కిరిసిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా తీరైన పట్టణాభివృద్ధి ప్రణాళికలు కొరవడి సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా 52శాతం పట్టణాలు, నగరాలకు(urbanization in india) సరైన ప్రణాళికలు లోపించాయని నీతి ఆయోగ్(NITI Aayog on urbanisation) తాజాగా కుండ బద్దలుకొట్టింది. క్రమబద్ధమైన పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పనలో సవాళ్లు ముమ్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. అందుబాటులో ఉన్న భూమిని గరిష్ఠంగా సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తు అవసరాల మేరకు సదుపాయాల వృద్ధిపై దృష్టిసారించడం పట్టణ ప్రణాళికల మౌలిక లక్ష్యం. వాటికి సంబంధించిన దేశీయ విధానాలు చాలా వరకు బ్రిటిష్ వలస పాలన నుంచి వారసత్వంగా సంక్రమించినవే.
ప్రభుత్వాల అలసత్వం!
కొద్దిపాటి నగిషీలతో ఏళ్ల తరబడి అవే అమలవుతున్నాయి. స్థానిక అవసరాలు, ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడేలా వాటిలో కాలానుగుణంగా మార్పుచేర్పులు అవసరమన్నది నీతి ఆయోగ్ సిఫార్సు. ప్రభుత్వ రంగంలో పట్టణ ప్రణాళికావేత్తల కొరతనూ ఆ సంస్థ ప్రస్తావించింది. పెద్ద సంఖ్యలో పోగుపడిన ఖాళీలను సత్వరం భర్తీ చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రణాళికలు కొల్లబోవడానికి ప్రభుత్వ యంత్రాంగంలో మేటవేసిన అవినీతి, అసమర్థత ప్రధాన కారణాలవుతున్నాయి. అవినీతి తిమింగిలాల కాసుల దాహానికి చెరువులు, నాలాలు కుంచించుకుపోతున్నాయి. కొద్దిపాటి వర్షాలకే నగరాలు వరదనీటి సంద్రాలవుతున్నాయి. ఇక నగరాల మౌలిక ప్రణాళికలకు తూట్లుపొడిచే అక్రమ నిర్మాణాల కథ.. అంతులేని వ్యధ. ఆ మేరకు భాగ్యనగరంలో పెచ్చరిల్లుతున్న నిబంధనల ఉల్లంఘనపై తెలంగాణ హైకోర్టు నిరుడు కన్నెర్రచేసింది. ఏపీలోని అన్ని పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో దాదాపు ఆరు వేల అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చిన బాగోతం గతేడాది వెలుగుచూసింది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాల అలసత్వమే పట్టణాలకు పెనుశాపంగా మారుతోంది!
తొలి వరసులో భారత్