తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పోషకాహార అభద్రతపై పోరాటం ఏది?

అప్పట్లో అయిదు వేల అంగన్‌వాడీ కేంద్రాలతో మొదలై అంచెలవారీగా ఏడువేల బ్లాకుల్లో రమారమి 14 లక్షలదాకా విస్తరించిన పిల్లల సమీకృత సేవల పథకం (ఐసీడీఎస్‌) నేటికీ మౌలిక లక్ష్య సాధనకు యోజనాల దూరాన నిలిచిపోయింది. పోషకాహార లేమిపై పోరాటానికి ఉద్దేశించిన కేటాయింపుల్లో సగందాకా ఖర్చు చేయనందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖను 'కాగ్‌' సూటిగా తప్పుపట్టింది. దేశంలో పోషకాహార లోపాలు పెచ్చరిల్లుతున్నాయన్న అధ్యయనాల హెచ్చరికల నేపథ్యంలోనూ 2020 బడ్జెట్‌లో సైతం పౌష్టిక ప్రణాళికలకు 19 శాతందాకా తరుగుపడింది. పోషకాహార భద్రతపై పాలకులు దృష్టి కేంద్రీకరించాలన్న స్వామినాథన్‌ ప్రభృతుల సిఫార్సుల స్ఫూర్తిని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆకళించుకోవాలి.

Editorial on rise of malnutrition in India
పోషకాహార అభద్రత... పోరాటం ఏది?

By

Published : Oct 1, 2020, 7:55 AM IST

నిరుపేద కుటుంబాల్లో పౌష్టికాహార సమస్యలకు విరుగుడుగా ఏనాడో 1975లోనే ప్రత్యేక కార్యాచరణ పట్టాలకు ఎక్కిన దేశం మనది. ఆరేళ్లలోపు పిల్లల పుష్టికర ఎదుగుదలను, రాష్ట్రాలవారీగా లక్షలాది బాలింతలు చూలింతలు కౌమార బాలికల బాగోగుల్ని లక్షించిన విశిష్ట పథకమది. అప్పట్లో అయిదు వేల అంగన్‌వాడీ కేంద్రాలతో మొదలై అంచెలవారీగా ఏడువేల బ్లాకుల్లో రమారమి 14 లక్షలదాకా విస్తరించిన పిల్లల సమీకృత సేవల పథకం (ఐసీడీఎస్‌) నేటికీ మౌలిక లక్ష్య సాధనకు యోజనాల దూరాన నిలిచిపోయింది. పసికందుల్ని పరిరక్షించుకోవడంలో ఘనా, టోగోవంటి ఆఫ్రికా దేశాల సరసనా ఇండియా వెలాతెలాపోవడానికి మూలకారణం ఏమిటో కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తాజా నివేదికాంశాలు చెప్పకనే చెబుతున్నాయి. పోషకాహార లేమిపై పోరాటానికి ఉద్దేశించిన కేటాయింపుల్లో సగందాకా ఖర్చు చేయనందుకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖను 'కాగ్‌' సూటిగా తప్పుపట్టింది.

కొన్నేళ్లుగా ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ కేటాయింపులు తెగ్గోసుకుపోతున్నాయి. ఉదాహరణకు, నాలుగేళ్లక్రితం రూ.15వందల కోట్లదాకా కేటాయింపులు తగ్గించి రూ.14వేలకోట్లకు పరిమితం చేశారు. దేశంలో పోషకాహార లోపాలు పెచ్చరిల్లుతున్నాయన్న అధ్యయనాల హెచ్చరికల నేపథ్యంలోనూ 2020 బడ్జెట్‌లో సైతం పౌష్టిక ప్రణాళికలకు 19శాతందాకా తరుగుపడింది. ఇటు రాష్ట్రాలూ తమవంతు బాధ్యత నిర్వహించడంలో భాగంగా ఏటా వేలకోట్ల రూపాయల మేర ఖర్చు చూపుతున్నా- వాస్తవిక అవసరాలకు, నికర వ్యయానికి పొంతన కుదరడంలేదు. అసలే అరకొర కేటాయింపులు; అవీ పూర్తిగా వ్యయంకాని పర్యవసానాలేమిటో ఇప్పటికే కళ్లకు కడుతున్నాయి. అయిదేళ్లలోపు పిల్లల అర్ధాంతర మరణాల్లో 68 శాతానికి పౌష్టికాహార లోపాలే పుణ్యం కట్టుకుంటున్నట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి నిరుడీ రోజుల్లో నిగ్గుతేల్చింది. అయిదేళ్లలోపు బాలల్లో 35శాతం గిడసబారి పోతున్నారన్నా, 17శాతం పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు పెరగడం లేదన్నా- ప్రధానలోపం ఎక్కడుందో స్పష్టమవుతూనే ఉంది!

దేశంలో ఎనిమిదిన్నర కోట్లవరకు ఆరేళ్లలోపు పిల్లలు, కోటీ 90లక్షల మందికిపైగా బాలింతలూ చూలింతల పోషకాహార అవసరాలు తీర్చడంలో అంగన్‌వాడీ కేంద్రాలు నిమగ్నమైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నిజానికి- వ్యాధి నిరోధక టీకాల సరఫరా, పౌష్టికాహార పంపిణీల నిమిత్తం దేశంలో 17 లక్షల అంగన్‌వాడీలు నెలకొల్పాల్సిందిగా 19 సంవత్సరాల క్రితమే సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది. రాష్ట్రాలవారీగా మంజూరై ఇప్పటికీ పని ఆరంభించని కేంద్రాల సంఖ్య వేలల్లో ఉండగా- కరోనా విజృంభణ అసంఖ్యాక అంగన్‌వాడీలను అచేతనం చేసింది. అన్నార్తులైన మహిళలు, పసికందులు ఆకలిమంటల్లో కమిలిపోరాదంటే అవన్నీ తిరిగి తెరుచుకోవాల్సిందేనన్న ప్రజాప్రయోజన వ్యాజ్య విచారణలో భాగంగా కేంద్రానికి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఇటీవలే నోటీసులు జారీ చేసింది. కొవిడ్‌ కష్టకాలంలో మారుమూల జనావాసాల్లోని గిరిజన మహిళల ఆరోగ్య సంరక్షణకు పాటుపడ్డ సిబ్బంది ఉదంతాలు కొన్ని వెలుగుచూసినా- సాధారణంగా పర్యవేక్షణ లోపాలకు, నాసి పనితీరుకు, పంపిణీల్లో అవకతవకలకు మారుపేరుగా అంగన్‌వాడీ కేంద్రాలెన్నో పరువు మాస్తున్నాయి. పుదుచ్చేరి, పశ్చిమ్‌ బంగ, బిహార్‌, తమిళనాడు, యూపీ వంటిచోట్ల పెద్దయెత్తున సిబ్బంది ఖాళీలు పేరుకుపోయినట్లు స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వశాఖే నిరుడు డిసెంబరులో వెల్లడించింది. గుత్తేదారుల బిల్లులే కాదు- ఆరోగ్య కార్యకర్తల వేతనాలు చెల్లించడానికీ నిధుల కటకట రివాజుగా మారిన దుస్థితి... సత్వర దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను ప్రస్ఫుటీకరిస్తోంది. పోషకాహార భద్రతపై పాలకులు దృష్టి కేంద్రీకరించాలన్న స్వామినాథన్‌ ప్రభృతుల సిఫార్సుల స్ఫూర్తిని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆకళించుకోవాలి. జాతి నిస్త్రాణను వదిలించేలా ఐసీడీఎస్‌కు చురుగ్గా సమీకృత చికిత్స చేపట్టాలి!

ABOUT THE AUTHOR

...view details