బహుముఖ ప్రజ్ఞాశాలిగా.. రాజనీతి దురంధరుడిగా విరాజిల్లిన ప్రణబ్ ముఖర్జీది అయిదు దశాబ్దాల ప్రజాజీవితం! సుదీర్ఘ ప్రజా జీవన ప్రస్థానంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడుదొడుకులను చవిచూశారు. ఎదురైన ప్రతి సవాలునూ సమర్థంగా ఎదుర్కొని విజయం సాధించారు. ప్రణబ్ పరమపదించడంతో దేశ రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది.
బహుముఖ పాలనా పటిమ నిండిన రాజకీయ జీవితం, పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన నాయకాగ్రేసరుల్లో ప్రణబ్ సైతం ఒకరు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రణబ్ దా కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి 2017లో పదవీ విరమణ చేసిన తరవాత- ప్రణబ్ దా ను అనేక సందర్భాల్లో కలిశాను. ఆయా సమయాల్లో వివిధ అంశాలు మా మధ్య చర్చకు వచ్చేవి. ఆయనలోని రాజనీతిజ్ఞత గురించి చాలామందికి తెలుసు. కానీ, ప్రణబ్ దా లోతైన అవగాహన, విశ్లేషణా సామర్థ్యం, అసాధారణ జ్ఞాపకశక్తి నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. దేశ చరిత్ర, పరిణామక్రమం, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో ఎదురుకానున్న సవాళ్లు సహా ప్రజాస్వామ్య పరిణామక్రమంపట్ల ఆయనకు అద్భుతమైన అవగాహన ఉంది. ఆయనతో సమావేశమైన ప్రతిసారీ అనేక అంశాలపై ఆయనకున్న ప్రజ్ఞా పాటవాలు, లోతైన పరిశీలనా శక్తి నన్ను ఆశ్చర్యపరచేవి. ఆయన ఓ నడిచే విజ్ఞానఖనిలా తోచేవారు. ఆ వయసులోనూ ప్రణబ్ దా విశ్లేషణ సామర్థ్యం, పదునైన జ్ఞాపకశక్తి నన్ను విస్మయానికి గురిచేసేవి. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటు. దేశం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది.
నిలువెత్తు సంస్కారం
రాజ్యసభ ఛైర్మన్‌గా పలుమార్లు కఠినమైన పరిస్థితులు తలెత్తినప్పుడు ఆయన నాలో స్థైర్యం నింపి, ప్రశాంతంగా సభను నిర్వహించేందుకు అవసరమైన విశ్వాసాన్ని ప్రోదిచేసేవారు. ఆయన ఆలోచనాత్మక సూచనలు ఓ విధమైన ఉత్తేజాన్ని అందించడమే గాక, సభ సజావుగా ముందుకు సాగేలా తోడ్పడేవి. ‘చర్చించండి, మీ అభిప్రాయాలు గట్టిగా వినిపించండి, అంతిమంగా నిర్ణయం తీసుకోండి. అంతే తప్ఫ.. సభను ఆటంకపరచకండి’ అంటూ వారు ఓ సందర్భంలో చెప్పిన మాటలను సభ్యులకు నేను గుర్తు చేస్తుంటాను.
లాల్ బహదూర్ శాస్త్రి, వి.పి.సింగ్‌ల తరవాత- రాజ్యసభ, లోక్‌సభలకు అధికారపక్ష నాయకుడిగా వ్యవహరించిన అత్యంత అరుదైన గౌరవం ప్రణబ్ ముఖర్జీకే దక్కింది. పార్లమెంటు సభ్యుడిగా తన బాధ్యతలను సంపూర్ణ నిబద్ధతతో నిర్వహించేవారు. రాజ్యసభలో వారి సహచరుడిగా సభా నియమాలపట్ల చిత్తశుద్ధి, విధివిధానాలపై ఆయనకున్న అవగాహన ఎంత గొప్పవో నాకు బాగా తెలుసు. ఒకసారి రాజ్యసభలో ఎల్.కె.ఆడ్వాణీ ప్రతిపక్ష నాయకుడిగా ఓ అంశాన్ని లేవనెత్తారు. ఆ సమయంలో ప్రణబ్ దా కూడా అంతే కఠినంగా ప్రతిస్పందించారు. వెంటనే నేను ప్రణబ్ ముఖర్జీని కలిసి, ఆడ్వాణీతో వ్యవహరించాల్సిన తీరు అది కాదంటూ మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేశాను. ఆ విషయంలో నా మాటలతో ప్రణబ్ దా ఏకీభవించారు. ప్రణబ్ దా ఆ తరవాత ఆడ్వాణీని కలిసి తలెత్తిన స్పర్థను సర్దుబాటు చేసుకున్నారు. అంతేకాదు- నాకు సైతం ధన్యవాదాలు తెలిపారు. ప్రణబ్ దా లోని ఈ విలక్షణతను గౌరవించి, అబ్బురపడనివారు బహుశా ఎవరూ ఉండరేమో!
రాజ్యసభ సభ్యుడిగా 1969లో రాజకీయాల్లో ప్రవేశించిన ప్రణబ్ ముఖర్జీ, అనతి కాలంలోనే అంటే 1973లోనే కేంద్ర మంత్రిమండలిలో స్థానం సంపాదించారు. ఆ తరవాత వివిధ మంత్రిపదవులను సమర్థంగా నిర్వహిస్తూ, 2017లో రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసేవరకు అనుక్షణం దేశ శ్రేయంకోసమే పరితపించారు. రాజకీయ నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, సమస్యల పరిష్కర్తగా, సమర్థుడైన పాలకుడిగా చేపట్టిన ప్రతి బాధ్యతలోనూ తనదైన ముద్రవేశారు. తపాలా కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్నప్పటి నుంచి- అత్యున్నత రాజ్యాంగబద్ధ పదవిని అధిరోహించేంత వరకు ఆయన చూడని కష్టనష్టాలు లేవు. లోతైన అవగాహన, విషయ పరిజ్ఞానం, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం, సహచరులను సహేతుకంగా అర్థం చేసుకోగల నేర్పరితనం, సమున్నత వ్యక్తిత్వం ప్రణబ్ దా సొంతం. తనను నమ్మినవారికి, అవసరమైన సమయాల్లో అత్యంత విశ్వసనీయమైన సంక్షోభ పరిష్కర్తగా సహకారం అందించారు. వివిధ అంశాలపై స్పష్టత, పరిజ్ఞానం, అందులోని లోటుపాట్లపై అవగాహన కారణంగానే ప్రణబ్ దా సమస్యలను చిటికెలో పరిష్కరించేవారు.
జాతీయతకు ప్రతీక