ప్రపంచాన్ని వినికిడి సమస్యలు వేధిస్తున్నాయి. అవతలివారు అరిచి గీపెట్టినా ఒక్క మాటా వినిపించని వారి సంఖ్య గతంతో పోలిస్తే గడచిన కొంతకాలంగా బాగా పెరుగుతోంది. దేశంలో వ్యాధులబారినపడిన వారి జనగణన ప్రకారం- 6.3 కోట్లమంది తీవ్రమైన వినికిడి లోపాలతో సతమతమవుతున్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ సమస్యలు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరిని ఈ సమస్య వేధిస్తోందన్న అంచనాలున్నాయి. ఈ సమస్య బారినపడుతున్నవారిలో అత్యధికులు మధ్యాదాయ దేశాల్లోనే ఉన్నారు. మరీ ముఖ్యంగా వీరిలో మూడింట ఒకటోవంతు 65 ఏళ్లకు పైబడినవారే!
వినికిడి సమస్యలు ఉన్నవాళ్లు 25 డెసిబుల్స్ ధ్వనిని గ్రహించలేరు. అవతలివారు సాధారణ స్థాయిలో మాట్లాడినా వినిపించదు. శ్రవణ సమస్యలు మితిమీరితే వినికిడి సాధనాల సాయం తీసుకోవాల్సి వస్తుంది. సమస్య శ్రుతిమీరినవారికి ఎలాంటి సాంకేతిక సాధనాలూ పనికిరావు. అలాంటివారు సంజ్ఞల ద్వారా అవతలివారితో సంభాషిస్తుంటారు. కొందరికి ఈ సమస్య వంశపారంపర్యంగా సంక్రమిస్తే ఇంకొందరు సాంక్రామిక వ్యాధుల కారణంగానో, పుట్టుకతోనే బరువు తక్కువ ఉండటంవల్లో లేదా కొన్ని రకాల ఔషధాలు ఒంటికి పడకపోవడం ద్వారానో వినికిడి లోపాలకు లోనవుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 110 కోట్లమంది యువత వినికిడి సమస్యలతో బాధపడుతోంది.
పరిమితికి మించి..
పరిమితికి మించిన స్థాయిలో శబ్దాలు వినడమే ఇందుకు చాలావరకు కారణం. అత్యధికంగా ఇయర్‌ఫోన్లు వినియోగించేవారిని ఈ సమస్య వేధిస్తోంది. ఒకరు వాడిన ఇయర్‌ఫోన్లను మరొకరు ఉపయోగిస్తే దానివల్ల సాంక్రామిక వ్యాధులు తలెత్తుతున్నాయి. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు విస్తరిస్తున్నాయి. చాలాసేపు అధిక శబ్దం వినడంవల్ల మానసిక ఇబ్బందులు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలూ తలెత్తుతున్నాయి. భారత ప్రభుత్వం 2000 ఫిబ్రవరి 14న శబ్ద కాలుష్యం (నిబంధనలు- నియంత్రణ) చట్టం తీసుకువచ్చింది. దానిప్రకారం పారిశ్రామిక ప్రాంతాల్లో పగటిపూట 75 డెసిబుల్స్, రాత్రి సమయాల్లో 70 డెసిబుల్స్ పరిమితి లోపే శబ్దం ఉండాలి. వాణిజ్య ప్రాంతాల్లో పగటిపూట 65 డీబీ, రాత్రి 55 డీబీకి మించిన శబ్దం ఉండరాదు. నివాస ప్రాంతాల్లో పగలు 55 డీబీ, రాత్రి 45 డీబీ పరిమితిలోపే శబ్దాలు ఉండాలి. నిశబ్ద ప్రాంతాల్లో పగలు 50డీబీ, రాత్రి 40డీబీ పరిమితి ఉండాలి. వైద్యశాలలు, విద్యా సంస్థలు, న్యాయస్థానాలవద్ద వాటికి వంద మీటర్ల దూరం వరకూ నిశ్శబ్ద జోన్లుగా ప్రభుత్వం తీర్మానించింది.