తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

తామరపువ్వు... ఇప్పుడు కుండీలోనే పెంచేయొచ్చు! - lotus can grow in vases now

లక్ష్మీదేవి, బ్రహ్మ, సరస్వతి... ఇలా దేవుళ్ల బొమ్మల్లో తప్పనిసరిగా కనిపించే కమలాన్ని పవిత్రమైనదిగా భావించి పూజల్లో పెడుతుంటాం. కానీ గులాబీ, చామంతి, లిల్లీ... వంటి పూల మొక్కల్లా తామరపూలని పెరట్లో పెంచుకోలేం. అయితే ఇప్పుడు ఆ పద్మాల్నీ మీనియేచర్ల రూపంలో బాల్కనీ కుండీల్లో వాకిళ్లలో ఎంచక్కగా పూయించేస్తున్నారు..!

lotus flower will grow in pot
కుండీలోనే తామరపువ్వు

By

Published : Nov 9, 2020, 1:40 PM IST

గులాబీ రంగులో వెడల్పాటి రేకులతో వికసించే పద్మం పవిత్ర పూజా పుష్పం మాత్రమే కాదు, ఆ రేకుల అమరిక చూడ్డానికీ అందంగానే ఉంటుంది. అందుకే చెరువుల్లో కొలనుల్లో మాత్రమే వికసించే ఆ తామర పువ్వుల్నీ ఇప్పుడు ఇళ్లలోనూ పెంచుతున్నారు.

సాధారణంగా కమలాల్లో గులాబీ తెలుపు రంగుల్నే చూస్తుంటాం. అదీ పెద్ద సైజులో వెడల్పాటి ఆకులతో ఉంటాయి. వాటిని పెంచాలంటే చిన్నపాటి కొలనులు ఉండాలని ఎక్కువమంది పెంచరు. కానీ గులాబీలూ చామంతుల్లో మీనియేచర్లు సృష్టించినట్లే రకరకాల పరిశోధనలు చేసి వెయ్యికి పైగా మినీ లోటస్‌ రకాల్నీ సృష్టించారు హార్టీకల్చరిస్టులు. మొట్టమొదటగా వీటిని చైనాలోని ఓ నర్సరీలో రూపొందించారట. వీటిల్లో ఫెయిరీ, రెయిన్‌బో, మిస్సింగ్‌, స్పార్క్‌, మినీ చు లేడీ... వంటివి ప్రధానమైనవి. పసుపూ తెలుపూ ఎరుపూ రంగులతోపాటు గులాబీరంగులోనే భిన్న షేడ్స్‌లో పూసే ఈ మినీ లోటస్‌ రకాల్ని గాలీ, వెలుతురూ తగిలేచోట ఇంట్లోనూ అలంకరించుకోవచ్చు అంటున్నారు ఉద్యాననిపుణులు. బటర్‌ఫ్లై లవ్‌, ఫెయ్‌కుయ్‌ రకాల్ని ఆరు అంగుళాల కుండీ లేదా బౌల్‌లోనూ పెంచుకోవచ్చు.

పెద్ద సైజు కమలాల్లో మాదిరిగానే వీటిల్లోనూ రంగులు మారే రకాలు, అంటే- ఎరుపు రంగులో విచ్చుకుని రోజులు గడిచేకొద్దీ గులాబీ, తెలుపు రంగుల్లోకి మారేవీ, గులాబీ నుంచి లేత పసుపురంగులోకి మారేవీ ఉన్నాయి. లేత రంగుల నుంచి నిండు రంగులోకి మారేవీ ఉన్నాయి. మీనియేచర్‌ రకాలే కాదు, గులాబీని తలపించే చైనీస్‌ డబుల్‌ రోజ్‌, తెలుపురంగులో మధుర పరిమళంతో వికసించే ఆల్బాగ్రాండిఫ్లోరా, తెలుపూగులాబీ కలగలిసిన చావన్‌ బసు, ముద్దగులాబీలా ఉండే మోమోబోటాస్‌ రకాల్ని కూడా కుండీల్లో పెంచుకోవచ్చట. మిసెస్‌ పెర్రీ స్లోకమ్‌ పరిమళాన్నీ వెదజల్లుతుందట.

ఎలా పెంచాలి?

దుంప వేళ్లు లేదా విత్తనాల ద్వారా పెంచుతారు. పెంచేటప్పుడు చిన్న సైజు కుండీ తీసుకుని అడుగున రెండు అంగుళాలమేరకు ఇసుక వేయాలి. దానిమీద పొరలు పొరలుగా మట్టి వేసి అది తడిచేవరకూ నెమ్మదిగా అంటే, మట్టి కదిలిపోకుండా నీళ్లు పోయాలి. ఇప్పడు విత్తనాలు లేదా దుంప వేరుని మట్టిలో పాతాలి. మొలకెత్తాక ఆకులు పెరిగేందుకు వీలుగా కుండీలో సగం వరకూ నీళ్లు పోయాలి. ఆకులు వచ్చేవరకూ ఎండ అవసరం అంత ఉండదు కానీ, ఆపై రోజూ ఏడెనిమిది గంటలపాటు ఎండ తగిలేచోట ఉంచాలి. పదిహేనురోజులకోసారి ఎరువు వేస్తే సరిపోతుంది. పువ్వులు పూయకున్నా పరవాలేదు అనుకునేవాళ్లు మినీ లోటస్‌ రకాల్ని ఆక్వేరియంలోనూ పెంచుతున్నారు. తామరపూల మాదిరిగానే కలువపూలనీ కాస్త పెద్దసైజు తొట్టెల్లో పెంచుతున్నారు. సో, పూజల్లో మాత్రమే చూసే కమలాలూ కలువలూ వాకిట్లో కనిపిస్తే ఆ అందమే వేరు!

ABOUT THE AUTHOR

...view details