తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

Stress Effects: కోపం... కుంగుబాటు...అనారోగ్యాలు కారణం ఒత్తిడే కావొచ్చు! - ఒత్తిడి ఆందోళన

ఇంటర్‌ చదివే రమ్య... అమ్మను లెక్క చేయనట్లే ప్రవర్తిస్తుంది ... దానికి కారణం ఏమయ్యుంటుందో తెలియక ఆమె సతమతమవుతోంది. ముప్పై ఏళ్ల దివ్యని ఏ చిన్న మాటన్నా... కళ్ల నీళ్లు పెట్టేసుకుంటుంది. ఆ సంఘటన నుంచి బయటపడటానికి రెండు మూడు రోజులు పడుతుంది. పదవీ విరమణ చేసిన పద్మది మరో సమస్య... ఎవరు పలకరించినా చిర్రుబుర్రులే. అంతా తనని ఉపయోగించుకుని వదిలేస్తున్నారంటూ రాద్ధాంతం. ఇదంతా స్ట్రెస్సే అంటున్నారు మానసిక నిపుణులు. అంతే కాదు... చాలా అనారోగ్యాలకు ఈ ఒత్తిడే కారణం అని చెబుతున్నారు. ఇవి మహిళల్లో మరీ ఎక్కువ. అసలు ఇది ఎందుకు వస్తుందో... దానికెలా అడ్డుకట్ట వేయాలో వివరిస్తున్నారు సైకియాట్రిస్ట్‌ నండూరి అర్చన.

Stress Effects
Stress Effects

By

Published : Nov 1, 2021, 11:00 AM IST

13-25 : ‘ఈ వయసులో ఏంటంత కోపం’, ‘చిన్నపిల్లవి నీకు ఒత్తిడేంటి’ అని కొట్టిపారేయకండి. ఎందుకంటే... కౌమార దశ నుంచి హార్మోన్ల మార్పులు మొదలవుతాయి. అప్పటివరకూ గారాబంగా చూసుకున్న అమ్మానాన్నలు భద్రత పేరుతో ఆంక్షల వలయం గీసేస్తుంటే ఆందోళన మొదలవుతుంది. దుస్తులు, స్నేహితులు, నడత... వంటి ప్రతిదీ పెద్దలు... పిల్లలకు చెబుతూనే ఉంటారు. ఏ పని చేసినా తమనే గమనించడంతో అమ్మాయిలు మరింత ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఇవన్నీ ఒత్తిడికి కారణాలే. ఇక, బాడీషేమింగ్‌, ఆత్మవిశ్వాస లోపం, చదువుల్లో పోటీ, బుల్లీయింగ్‌ వంటివీ ఈ సమస్యకు తోడవ్వచ్చు. ఇటీవలి కాలంలో కొందరిపై సోషల్‌మీడియా కూడా ప్రభావం చూపిస్తోంది.

ఆన్‌లైన్‌ వాడకం పెరిగి... అపరిచితులతో స్నేహం, ప్రేమ వంటి విషయాల్లో ఎమోషనల్‌ బ్రేకప్స్‌ పెరిగిపోయాయి. తమ కోరికల్ని అమ్మానాన్నలు తీర్చకపోతే... గుర్తింపు కోల్పోతున్నామని బాధపడిపోతుంటారు కొందరు. అదే ఒత్తిడిగా మారడంతో పెద్దలపై తిరగబడటం, శత్రువుల్లా చూడటం చేస్తారు. నిజానికి ఈ వయసు వారిలో ఒత్తిడి నియంత్రించాలంటే తల్లిదండ్రులకే కౌన్సెలింగ్‌ అవసరం. పిల్లల్ని ఎలా హ్యాండిల్‌ చేయాలి? ఆ వయసు ఆడపిల్లల్లో వచ్చే శారీరక మార్పులు ఏంటి? వంటివన్నీ తెలుసుకోవాలి. వారి భావోద్వేగాలను గమనించడానికీ, సమస్యలను సర్దుబాటు చేయడానికి తల్లి తప్పనిసరిగా అమ్మాయితో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడే వారి ఆలోచనల్ని గమనించగలరు. సమస్య పరిష్కారానికి కృషి చేయగలరు.

26-40 : ఈ దశలో ప్రీమ్యారిటల్‌ ఇష్యూస్‌ ఎక్కువ. ఎలాంటి భాగస్వామి వస్తాడు. చెప్పింది వింటాడా? నా కెరియర్‌? అమ్మానాన్నల్ని ఎవరు చూస్తారు... ఇలా ఎన్నో ఆలోచనలు. పెళ్లయ్యాక సర్దుబాటు సమస్యలు. అత్తమామలు, ఆడపడుచులతో విభేదాలు, కొత్త బాధ్యతలు, పద్ధతుల్లో తేడాలు ఇలా చాలానే కలవరపెడుతుంటాయి. ఇవన్నీ ఎక్కువ రోజులు కొనసాగితే క్రానిక్‌ స్ట్రెస్‌గా మారుతుంది. ఫలితంగా రుతుక్రమంలో తేడాలు, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, నడుం, తల నొప్పులూ మొదలవుతాయి. మెదడులోని ఇబ్బంది కాస్తా శరీరంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. చికిత్స తీసుకోకపోతే క్రమంగా డిప్రెషన్‌, యాంగ్జైటీ వంటి సమస్యలెదురవుతాయి. అప్పటికీ నియంత్రించుకోలేకపోతే... మందుల దాకా వెళ్లాలి. ఇవి కాక ఎక్యూట్‌ స్ట్రెస్‌ కూడా ఉంటుంది. విడాకులు, మోసం, ఇతరత్రా ఉపద్రవాలు ఎదురైతే వాటిని అంగీకరించలేక ఈ వయసు మహిళలు ఒత్తిడిలో కూరుకుపోతుంటారు. ఇటీవల వయసుతో నిమిత్తం లేకుండానే, నెలసరుల్లో తేడాలు, హార్మోన్ల అసమతుల్యత, భావోద్వేగాల్లో మార్పు వంటి ఒత్తిడి సూచనలు కనిపిస్తున్నాయి.

కారణాన్ని ఎవరికి వారే గుర్తించాలి. స్టెబిలిటీ కోసం వర్కవుట్లు చేయడం మొదలుపెట్టాలి. పండ్లూ, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు గుర్తించలేకపోతే... ఆత్మీయుల సాయం తీసుకోండి. సాధ్యం కాకపోతే... ప్రొఫెషనల్స్‌ ఉన్నారు. వారితో మాట్లాడండి. అప్పుడే ఒత్తిడి నుంచి బయటపడగలరు.

41-60 : నలభైల్లోకి అడుగుపెట్టిన మూడు నాలుగేళ్లు... టీనేజీ పిల్లలు మాట వినట్లేదు, వారి చదువులు... వంటివే ఇబ్బందిపెడుతుంటాయి. దీనికి తోడు మల్టీటాస్కింగ్‌ కూడా స్ట్రెస్‌కి కారణం. ఆ తర్వాత బిడ్డలు కెరియర్‌, పెళ్లి అంటూ... తమ కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. అది మొదలు తల్లిదండ్రులకు... వారు పట్టించుకోవడం లేదు అనే భావన వస్తుంది. వీటికి తోడు ఆర్థిక అభద్రత, అనారోగ్య సమస్యలూ వెంటాడతాయి.

ఇవన్నీ తెలియకుండానే ఒత్తిడికి గురి చేస్తాయి. ఈ దశలోనే మెనోపాజ్‌నీ ఎదుర్కోవాలి. అది సహజమైన పరిస్థితి అని ముందు నుంచే అర్థం చేసుకుంటే... మనోవ్యథ ఉండదు. పిల్లలపై అతి అంచనాలు, వారి ప్రేమనూ, సమయాన్నీ ఆశించడం వంటివీ చేయకూడదు. బదులుగా అభిరుచుల ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. నియంత్రించుకోలేని పరిస్థితుల్లోనూ, ఎక్యూట్‌ స్ట్రెస్‌కి గురవుతున్నప్పుడు నిపుణుల సాయం తీసుకోవాలి. 360 డిగ్రీల కోణంలో ఆలోచించగలిగితేనే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు.

ఇదీ చూడండి:నొప్పి భరిస్తూనే ఈ స్టార్స్ నటిస్తున్నారు..!

స్టార్స్​కు ఒత్తిడి అనిపిస్తే.. ఈ పనిచేస్తారు!

ABOUT THE AUTHOR

...view details