మహిళల ముఖ సౌందర్యాన్ని తగ్గించే సమస్యల్లో ముడతలు, పిగ్మెంటేషన్ ప్రధానమైనవి. ముడతలతో వయసు పైబడిన వారిలా కనిపిస్తే... పిగ్మెంటేషన్ మచ్చలతో ముఖమంతా అంద విహీనంగా మారుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని సౌందర్య సాధనాలు ఉన్నా సత్ఫలితాలను ఇస్తాయన్న గ్యారంటీ లేదు. పైగా ఒక్కోసారి దుష్ప్రభావాలు కూడా ఎదురుకావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బాదం పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలు ఈ సమస్యలను అధిగమించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ప్రత్యేకించి మెనోపాజ్ దశలో ఉన్న కొంతమంది మహిళల ముఖాలపై ముడతలు, చర్మం రంగు మారడం వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో బాదం పప్పు బాగా సహకరిస్తుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
చర్మ సమస్యలకు చెక్!
క్యాలరీలు తక్కువగా ఉండే బాదం పప్పును చాలామంది బరువు తగ్గించుకోవడానికి స్నాక్స్‌గా వినియోగిస్తారు. ఇందులోని విటమిన్-ఇతో పాటు మోనో అన్‌శ్యాచురేటెడ్ కొవ్వుల కారణంగా వీటిని నిత్యం తీసుకునే మహిళల్లో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువని గత అధ్యయనాల్లో తేలింది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న బాదం పప్పుతో మహిళల్లో ముఖం పైన ముడతలు, పిగ్మెంటేషన్ మచ్చలు కూడా మాయమవుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
రెండు బృందాలుగా విభజించి..
పరిశోధనలో భాగంగా- ఎండ పడ్డప్పుడు చర్మం మండే, ముడతలు పడే, రంగు మారిపోయే స్వభావం కలిగిన మహిళలను రెండు బృందాలుగా విభజించారు. వీళ్లంతా మెనోపాజ్ దశలో ఉన్న ఆరోగ్యవంతులైన మహిళలే కావడం గమనార్హం. వీరిలో ఒక బృందానికి స్నాక్స్ కింద సుమారు 60 గ్రాముల బాదం పప్పు (340 క్యాలరీలు)ను ఇచ్చారు. రోజులో వారు తీసుకునే మొత్తం క్యాలరీల్లో దీని వాటా 20 శాతంగా ఉండేలా చూశారు. ఇక రెండో బృందానికి ఇతర ఆహార పదార్థాలు (ఫిగ్ బార్, గ్రానోలా బార్ వంటివి) అల్పాహారంగా అందించారు. అధ్యయనంలో పాల్గొన్న మహిళలు- బాదంతో పాటుగా, వాళ్లు రెగ్యులర్ గా తీసుకునే ఇతర ఆహార పదార్ధాలను మామూలుగానే తీసుకున్నారు. అయితే- ఒక్క బాదం తప్ప ఇతర నట్స్ ఏవీ వారి ఆహారంలో చేర్చుకోలేదు.
ఇలా 8, 16, 24 వారాలకొకసారి చొప్పున రెండు బృందాల్లోని మహిళల చర్మాలపై పరిశోధన సాగిస్తూ వచ్చారు. ఇందులో భాగంగా హై రిజల్యూషన్ కలిగిన ఫేషియల్ ఇమేజింగ్ విధానం ద్వారా మహిళల ముఖాలపై ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రతను పరిశీలించారు. అధునాతన 3డీ ఫేషియల్ మోడలింగ్ అండ్ మెజర్‌మెంట్‌నూ ఈ పరిశోధనలో వినియోగించారు.