ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి! - healthy tips for everyone
మనలో చాలామందికి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కాస్త ఎక్కువే అని చెప్పాలి. కరోనా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పట్నుంచి అది మరింత పెరిగింది. ఎవరిని చూసినా ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి? సంపూర్ణ ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంత సేపు వ్యాయామం చేయాలి? వైరస్, ఇతర అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?.. ఇలా ప్రస్తుతం అందరి కళ్లూ నెట్‌లో ఆరోగ్య చిట్కాలను వెతికే పనిలో పడ్డాయి. అయితే ఇలాంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఏ ఒక్క ఆహారంతోనో అది సాధ్యం కాదని, రోజంతా మనం తీసుకునే పోషకాహారం-చేసే వ్యాయామాలే ఈ క్రమంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ఇందులో భాగంగానే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటే పాటించాల్సిన నియమాల గురించి ‘సీక్రెట్స్ ఆఫ్ గుడ్ హెల్త్’ పేరుతో తాను రాసిన ఆడియో బుక్‌లో పొందుపరిచారామె. అందులోని కొన్ని హెల్త్ సీక్రెట్స్ గురించి మనతో ఇలా పంచుకున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లు తప్పనిసరి!
By
Published : Apr 9, 2021, 4:09 PM IST
మనం పాటించే ఆరోగ్యకరమైన జీవనశైలే మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందంటుంటారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్. ఈ క్రమంలోనే సీజనల్ వ్యాధులు-వాటిని నివారించే మార్గాలు, మహిళల ఆరోగ్యం, పోషకాహారం, వ్యాయామాలు.. తదితర విషయాలకు సంబంధించిన చిట్కాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతుంటారామె. అంతేకాదు.. ఆరోగ్యానికి సంబంధించిన పుస్తకాలను కూడా రాస్తుంటారు రుజుత. ఈ క్రమంలోనే ‘సీక్రెట్స్ ఆఫ్ గుడ్ హెల్త్’ పేరుతో ఆమె రాసిన ఆడియో పుస్తకంలో ఆహారంపై ఉన్న అపోహలు-వాస్తవాలు, డైట్ ట్రెండ్స్, బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యాలు, ఫిట్‌నెస్ చిట్కాలు.. వంటివెన్నో పొందుపరిచారామె. వాటిలో కొన్ని చిట్కాల గురించి తన మాటల్లోనే..!
రోజును ఇలా ప్రారంభిద్దాం!
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఆ రోజు మనం తీసుకునే తొలి ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో శరీరానికి శక్తిని అందించే పదార్థాలకు అధిక ప్రాధాన్యమివ్వాలి. పండ్లు, నట్స్.. వంటివి వీటి కిందకే వస్తాయి. రోజూ ఉదయాన్నే ఏదైనా ఒక పండు లేదంటే ముందు రోజు రాత్రంతా నానబెట్టిన కొన్ని బాదం పప్పులు/కిస్‌మిస్‌లను రెండు కుంకుమ పువ్వు రేకలతో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం అలవాటుగా మార్చుకుంటే రోజూ యాక్టివ్‌గా ఉండడమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మంచిది.
బరువుతో పనిలేదు!
లావుగా/బరువు ఎక్కువగా ఉంటే దాన్ని అనారోగ్యంగా భావిస్తుంటారు చాలామంది. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు ఓ లక్ష్యాన్ని సైతం ఏర్పరచుకుంటుంటారు. కఠినమైన వ్యాయామాలు సైతం చేస్తుంటారు. కానీ నిజానికి శరీర బరువు అనేది ఫిట్‌నెస్‌ను, శరీరంలోని కొవ్వు స్థాయుల్ని సూచించదు. కాబట్టి బరువు ఎక్కువా? తక్కువా? అని ఆలోచించకుండా ఆరోగ్యంగా ఉన్నామా? లేదా? అనేది చూసుకోవాలి. ఈ క్రమంలో పోషకాహారం తీసుకోవడం, కంటి నిండా నిద్ర పోవడం, శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి వ్యాయామాన్ని రొటీన్‌లో భాగం చేసుకోవడం.. వంటివి చాలా ముఖ్యం.
మొదటి ముద్ద నెయ్యితోనే!
‘అమ్మో నెయ్యి తింటే లావవుతాం’ అన్న అపోహతో అమృతంతో సమానమైన ఈ పదార్థాన్ని దూరం పెడుతుంటారు చాలామంది. కానీ రోజూ మనం మూడు పూటలా తీసుకునే భోజనంలో (అల్పాహారం, లంచ్, డిన్నర్) టీస్పూన్ నెయ్యి వేసుకుంటే చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే నెయ్యిలో ‘ఎ’, ‘డి’, ‘ఇ’, ‘కె’.. వంటి కొవ్వును కరిగించే విటమిన్లు ఉంటాయి. అంటే శరీరంలో కొవ్వును పెంచడం కాదు.. పేరుకున్న కొవ్వును కరిగించడంలో ఇది చక్కగా పనిచేస్తుందన్న మాట! అందుకే తినేటప్పుడు దీన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇక దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో లభించే సీజనల్ పండ్లు (వేసవిలో పుచ్చకాయ, తర్బూజా.. వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లు), రాగులు-జొన్నలు.. వంటి తృణధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం తప్పనిసరి. ఇక స్నాక్స్ సమయంలో ఏదైనా పండు తీసుకోవడం, రాత్రి 8 లోపే డిన్నర్ ముగించడం కూడా మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే అంశాలు.
వ్యాయామం అందుకు కాదు!
బరువుతో సంబంధం లేకుండా సంపూర్ణ ఆరోగ్యానికి మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో.. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం కూడా అంతే ముఖ్యం. కాబట్టి వారానికి మూడు గంటల చొప్పున రోజుకు అరగంట పాటు వ్యాయామం ఎవరికైనా అవసరమే! ఇక కాస్త తీవ్రత ఎక్కువగా ఉండే వ్యాయామాలు చేయాలనుకున్న వారు ముందుగా వార్మప్‌తో ప్రారంభించడం వల్ల గాయాలు పాలు కాకుండా కాపాడుకోవచ్చు. ఇలా రోజూ మనం చేసే వ్యాయామాలు నిద్రను ప్రేరేపిస్తాయి. రాత్రుళ్లు సుఖంగా నిద్ర పోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. అలాగే రాత్రి పడుకోవడానికి ముందు గ్లాసు పసుపు పాలు చాలా మంచివి.
తినేటప్పుడూ వాటి ధ్యాసేనా?!
ఇంటి నుంచి పని, ఆన్‌లైన్ క్లాసులు.. ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో చాలామంది మొబైల్స్, ల్యాప్‌టాప్స్, టీవీలు.. వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. నిజానికి వీటివల్ల రిలాక్సేషన్ మాటేమో గానీ ఒత్తిడి-ఆందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. ఇందుకు నిరంతరాయంగా స్క్రీన్‌ని చూడడం ఒక కారణమైతే, కరోనా గురించిన వార్తలు కలవరానికి గురిచేయడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి గ్యాడ్జెట్లను మితంగా వాడుకోవడం, తినేటప్పుడు మాత్రం వీటిని పూర్తి దూరం పెట్టడం, మిగతా సమయం విశ్రాంతికే కేటాయించడం.. వంటి చిట్కాల్ని పాటిస్తే శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.