బరువు తగ్గాలని రకరకాల డైట్‌లను అనుసరిస్తూ.. కష్టపడి క్యాలరీలు కరిగించేవారి సంఖ్య ఈరోజుల్లో కాస్త ఎక్కువగానే ఉంటోంది. అయితే తీరిక లేని కారణంగానో లేక త్వరగా బరువు తగ్గాలన్న ఆత్రంతోనో కొందరు ఉదయం పూట తీసుకునే అల్పాహారాన్ని అప్పుడప్పుడూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు సరికదా.. మధ్యాహ్నం ఇంకాస్త ఎక్కువగా ఆకలి వేసి మనకు తెలియకుండానే అధికంగా ఆహారం తీసుకునే వీలు ఉంటుంది. అందుకే బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్లు అధికంగా ఉండే పదార్థాలను ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చేసుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే తీసుకోదగిన ఆ పదార్థాలేంటో ఒకసారి మనమూ చూసేద్దామా..
ఈ బ్రేక్‌ఫాస్ట్‌తో బరువు తగ్గేద్దాం!
By
Published : May 4, 2021, 7:26 AM IST
రోజంతా ఉత్సాహంగా ఉంటూ పని చేసుకోవడానికి సరిపడా శక్తి సమకూరాలంటే వివిధ పోషక విలువలతో కూడిన ఆరోగ్యవంతమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం. అయితే బరువు తగ్గాలనుకునేవారు 'అల్పాహారం చేయకపోతే ఇంకా త్వరగా బరువు తగ్గచ్చు' అని అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి ప్రొటీన్స్ అధికంగా ఉండే ఆహారపదార్థాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం ద్వారా ఇంకా త్వరగా బరువు తగ్గే అవకాశాలున్నాయి అంటున్నారు నిపుణులు.
ఎలా అంటే..
సాధారణంగా ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకున్నప్పుడు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. కాబట్టి ఇతర ఆహారపదార్థాల పైకి అంత త్వరగా దృష్టి మళ్లదు. అదీకాకుండా మన శరీరంలో ప్రొటీన్స్‌ని జీర్ణం చేసుకునేందుకు అయ్యే క్యాలరీల ఖర్చు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే కొవ్వులు, కార్బోహైడ్రేట్స్‌తో పోలిస్తే బరువు తగ్గాలని అనుకునే వారు ప్రొటీన్స్ అధికంగా ఉండే పదార్థాలను తమ డైట్‌లో భాగం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తారు. ప్రొటీన్స్ పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా ఆకలిని నియంత్రించే విధంగా మెదడు నుంచి బలమైన సంకేతాలు వెలువడినట్లు ఎం.ఆర్.ఐ స్కాన్‌లో కూడా తేలిందని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు నిరూపించాయి.
కోడిగుడ్లు..
ప్రొటీన్లు ఎక్కువగా లభించే పదార్థాలు అనగానే అందరికీ ఠక్కున గుర్తుకొచ్చే ఆహారపదార్థాల్లో గుడ్లు కూడా ఒకటి. ఉదయాన్నే పప్పు ధాన్యాలతో కూడిన ఆహారపదార్థాలకు బదులుగా గుడ్డుతో తయారుచేసిన పదార్థాలను అల్పాహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి తగిన శక్తి అందడమే కాకుండా తర్వాత సమయంలో తక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తారు. అందుకే కోడిగుడ్లను ఇతర కూరగాయలతో కలిపి వండుకోవడం లేదా కాటేజ్ చీజ్, పాలకూర ఉపయోగించి ఆమ్లెట్‌గా వేసుకోవడం.. ద్వారా వాటిని అల్పాహారంలో భాగంగా చేసుకోవచ్చు. అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్స్ అందించే ఆహారపదార్థాలను చేర్చడంలో భాగంగా కేవలం కోడిగుడ్లకే పరిమితమవ్వాల్సిన అవసరం లేదు.. చేపలు, మాంసం, పాలు, పాల సంబంధిత పదార్థాలు.. మొదలైనవి కూడా భాగం చేసుకోవచ్చు.
ప్యాన్‌కేక్స్‌తో..
కోడిగుడ్లలోని తెల్లసొన అరకప్పు, ఓట్‌మీల్, కాటేజ్ చీజ్.. ఇవన్నీ ఒక గిన్నెలో వేసి అందులో చెంచా బేకింగ్ సోడా కూడా జత చేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్యాన్‌పై చిన్న చిన్న అట్లుగా పోసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న ప్యాన్ కేక్స్‌కి తాజా పండ్లు, తేనె జత చేసి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం ద్వారా శరీరానికి ప్రొటీన్స్ పుష్కలంగా అందుతాయి. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయి. బీన్స్‌తో.. బీన్స్‌లో పీచుపదార్థాలే కాదు.. ప్రొటీన్స్ కూడా అధిక స్థాయిలోనే ఉంటాయి. పైగా వీటిలో ఉండే పీచుపదార్థాలు చాలా త్వరగా శరీరంలో కలిసిపోతాయి. అంతేకాదు.. పొట్ట దగ్గర ఉండే కొవ్వుని కరిగించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకున్న తర్వాత అధిక సమయం కడుపు నిండుగా ఉన్న భావన కలిగేలా చేస్తాయి. బీన్స్‌ని కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవడం ద్వారా బరువు తగ్గడమే కాదు.. దీర్ఘకాలంలో చక్కని నాజూకైన లుక్‌ని కూడా మన సొంతం చేసుకోవచ్చు.
పుచ్చకాయతో..
నీటిశాతం అత్యధికంగా ఉండే పండ్లలో మొట్టమొదటి స్థానంలో ఉండే పుచ్చకాయని అల్పాహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా చక్కని ప్రయోజనాలు పొందచ్చు. అయితే ఇందులో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉదయాన్నే తీసుకోకూడదని కొందరు అభిప్రాయపడినప్పటికీ మితమైన మోతాదులో తీసుకోవడం ద్వారా చక్కటి ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఉదయాన్నే దీనిని అల్పాహారంగా తీసుకునే వారిలో కొవ్వులు తక్కువ స్థాయిలో పేరుకున్నట్లు వెల్లడైంది.
బ్రేక్‌ఫాస్ట్‌పై వేసుకునే టాపింగ్స్‌గా మిరియాలు, వాల్‌నట్స్, అల్లం, దాల్చినచెక్క, అవిసె గింజలు, కొబ్బరినూనె.. మొదలైనవి ఉపయోగించడం ద్వారా కూడా సులభంగా బరువు తగ్గచ్చు.
చూశారుగా.. బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే తీసుకోదగిన కొన్ని బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్ గురించి..! మీరు కూడా వీటిని మీ మెనూలో భాగం చేసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే అందంగా, నాజూగ్గా తయారయ్యేందుకు సన్నద్ధమైపోండి..