తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2021, 9:33 AM IST

ETV Bharat / lifestyle

Miss world america shree saini: గుండె జబ్బు... అగ్నిప్రమాదం... కిరీటాన్ని ఆపలేదు!

చిన్నపాటి వైఫల్యానికే ‘నా అదృష్టం ఇంతే’ అంటూ బాధపడిపోతాం! మరి ఆమెకి? పేస్‌మేకర్‌ లేకుండా గుండెకొట్టుకోదు. యాక్సిడెంట్‌లో కాలిన ముఖం. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వరుస వైఫల్యాలు... అయినా నిరాశ పడలేదు. తన కలల కిరీటాన్ని దక్కించుకోవడానికి ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా చేసుకుని పోరాడి గెలిచింది శ్రీసైనీ(Miss world america shree saini).

Miss world america shree saini
మిస్ వరల్డ్ అమెరికా శ్రీ సైనీ

రెండేళ్ల క్రితం... అమెరికాలో ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా’ పోటీలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఆ అందాల కిరీటం ఎవరిని వరించబోతోందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. మిస్‌ స్మైల్‌తో సహా మరో ఐదు టైటిళ్లను గెల్చుకున్న భారతీయ సంతతి అమ్మాయి శ్రీసైనీ(Miss world america shree saini) మాత్రం తన ఆనందాన్ని ఆ వేదికపై పంచుకోలేకపోయింది. కారణం... తనా వేదికపైనే గుండె పోటుతో కుప్పకూలింది. నిర్వాహకులు.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సైనీ దగ్గరకే వెళ్లి ఆ అవార్డులని అందించి ధైర్యం చెప్పారు. మరొకరైతే అంత జరిగాక మళ్లీ పోటీల జోలికి వెళ్లేవారు కాదేమో. సైనీ మాత్రం ప్రయత్నాన్ని మానుకోలేదు... పోరాటాన్ని ఆపలేదు... ఫలితమే ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా’ కిరీటం.

గుండెజబ్బుతో పోరాటం..

శ్రీసైనీ(Miss world america shree saini) పంజాబ్‌లో పుట్టింది. అయిదేళ్లప్పుడు వాళ్ల కుటుంబం వాషింగ్టన్‌కు వలస వెళ్లింది. చదువుతోపాటు డాన్స్‌లోనూ ఉత్సాహంగా ఉండే ఈమెకి 12 ఏళ్ల వయసులో గుండెజబ్బు ఉందని తెలిసింది. గుండె నిమిషానికి 20 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. పేస్‌మేకర్‌ అవసరమన్నారు వైద్యులు. అంతేకాదు... ఇక నుంచి డ్యాన్స్‌కీ గుడ్‌బై చెప్పాల్సిందే అన్నారు. చికిత్స తర్వాత కోలుకున్న సైనీ తిరిగి డ్యాన్స్‌ సాధన మొదలుపెట్టింది. చదువుల్లోనూ వెనుకబడ లేదు. గుండె జబ్బు ఓ లోపంగా, తన కలలకి అడ్డుగా భావించలేదు సైనీ. అందాల పోటీల్లో ప్రపంచ విజేతగా నిలవాలని కలలు కనేది.

మరో గాయం

ఇంతలో మరో సవాల్‌ ఆమె ఆత్మవిశ్వాసానికి పరీక్ష పెట్టింది. ఓ కారు ప్రమాదంలో సైనీ ముఖం కాలి తీవ్రగాయాలయ్యాయి. ఇక తన లక్ష్యాన్ని మర్చిపోవాల్సిన సమయం వచ్చింది అనుకుంది. అప్పుడే అమ్మానాన్నలు ఆమెకు ఓదార్పుతోపాటు ప్రోత్సాహాన్నీ అందించారు. వరుస చికిత్సలతోపాటు అమ్మ నిరంతరం ఇస్తూ వచ్చిన కౌన్సెలింగ్‌ సైనీని ఆ సమస్య నుంచి బయటకొచ్చేలా చేసింది. తన అనారోగ్యం ఆమెని ఆలోచింప చేసింది. పాఠశాలలో ఉన్నప్పుడే హృద్రోగం, ఒత్తిడి వంటి అంశాలపై అందరికీ అవగాహన కలిగించేది. వీటిపై తను రాసిన ఎన్నో వ్యాసాలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. చిన్న వయసులోనే 30 రాష్ట్రాలు, ఎనిమిది దేశాల్లో ప్రసంగాలు ఇచ్చింది. తన సేవలను గుర్తించి యునిసెఫ్‌ కూడా అభినందించింది. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో నాన్‌ డిగ్రీ సమ్మర్‌ కోర్సు, వాషింగ్టన్‌ యూనివర్శిటీలో జర్నలిజం పూర్తిచేసింది.

ఐదేళ్ల కల సాకారం

చదువు, అవగాహన కార్యక్రమాలతోపాటు తన కలైన అందాల పోటీల్లోనూ పాల్గొనడానికి తగిన శిక్షణ తీసుకుంది శ్రీ(Miss world america shree saini). ఫలితంగా 2017లో మిస్‌ ఇండియా యూఎస్‌ఏగా, 2018లో మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌గా నిలిచింది. 2019లో మిస్‌వరల్డ్‌ అమెరికా పోటీల్లో అనారోగ్యంతో తుది జాబితాకు చేరుకోలేకపోయినా ఆరు విభాగాల్లో విజయం సాధించింది. 2020లో రెండోసారి మిస్‌ వరల్డ్‌ అమెరికా పోటీల్లో టాప్‌టెన్‌లో ఒకరిగా మాత్రమే నిలిచింది. ఇప్పుడు ‘మిస్‌ వరల్డ్‌ అమెరికా’గా ఐదేళ్ల తన కలని నిజం చేసుకుంది.

‘మా అమ్మ లేకపోతే ఈ వేదికపై నేను లేను. చిన్నప్పట్నుంచీ అనారోగ్యం. తర్వాత ప్రమాదంతో ముఖమంతా గాయాలు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న నన్ను మళ్లీ మనుషుల్లోకి తీసుకొచ్చింది అమ్మే. ఈ కిరీటాన్ని అందుకున్న తొలి భారతీయురాలిని కావడం సంతోషంగా ఉంది. బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ అంబాసిడర్‌గా బాలికల చదువు కోసం కృషి చేస్తా’నంటోంది ఈ 'మిస్ వరల్డ్ అమెరికా' శ్రీ సైనీ

ఇదీ చదవండి:engili pula bathukamma: ఎంగిలి పూలతో బతుకమ్మకు స్వాగతం.. తెలంగాణలో ప్రతి ఇంటా కోలాహలం

ABOUT THE AUTHOR

...view details