తెలంగాణ

telangana

By

Published : Oct 1, 2020, 6:15 PM IST

ETV Bharat / jagte-raho

విషాదం: చెరువులో పడి ముగ్గురు చిన్నారుల దుర్మరణం

ఆడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులను చెరువు మింగేసింది. సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన ఐదుగురు చిన్నారుల్లో.. ముగ్గురిని తనలో కలిపేసుకుంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

Three children fell into a pond and died in dandupally
విషాదం: చెరువులో పడి ముగ్గురు చిన్నారుల దుర్మరణం

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మద్దుల చెరువులో ప్రమాదవశాత్తు పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.

దండుపల్లి మధిర గ్రామం పిట్టలవాడకు చెందిన జైహింద్​, స్వరూప దంపతుల పిల్లలు అఖిల, చరణ్​.. శ్రీను, సావిత్రి దంపతుల కుమారులు నవీన్​, కార్తీక్​.. వెల్దుర్తి మండలం మాసాయిపేటకు చెందిన రాజు కొడుకు రవిలు కలిసి ఆడుకునేందుకు గ్రామ సమీపంలోని మద్దుల చెరువు వద్దకు వెళ్లారు. చెరువు అంచున ఆడుకుంటున్న క్రమంలో రవి ముందుగా చెరువులోకి దిగాడు. అతని వెంటే నవీన్, అఖిల, కార్తీక్​​లు సైతం చెరువులోకి దిగగా.. చరణ్​ ఒడ్డుపైనే ఉండిపోయాడు. ఈ క్రమంలో రవి, అఖిల, నవీన్​లు ప్రమాదవశాత్తు నీటిలోకి జారిపోయారు. కార్తీక్​ ఒడ్డుకు చేరుకున్నాడు.

అనంతరం కార్తీక్​ను ఒడ్డున కూర్చోబెట్టి చరణ్ గ్రామంలోకి వెళ్లి స్థానికులకు విషయం చెప్పాడు. యువకులు వచ్చి చిన్నారులను బయటకు తీయగా.. అప్పటికే ముగ్గురూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు మృతదేహాల వద్ద పడి రోదించిన తీరు అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది. చిన్నారులంతా 10 సంవత్సరాలలోపు వారే కావడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఘటనా స్థలికి చేరుకున్న తూప్రాన్ డీఎస్పీ కిరణ్​కుమార్, సీఐ స్వామి గౌడ్, ఎస్సై రాజు గౌడ్, తహసీల్దార్ శ్రీదేవిలు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చిన్నారుల తల్లిదండ్రులంతా జాతీయ రహదారిపై సీతాఫలాలు, మొక్కజొన్న పొత్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు.

ఇదీచూడండి: ఫెన్సింగ్​ దాటుతుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details