సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్‌లో ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ సర్కార్ చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల సర్వేలో.. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి తనకు దక్కదేమోనని మనస్తాపానికి గురైన శంకరయ్య ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు.
వ్యవసాయేతర ఆస్తుల నమోదు సందర్భంగా పంచాయతీ సిబ్బంది కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఇంటి పెద్ద కొడుకు పెంటయ్య పేరుతో నమోదు చేసి, ఆయన తమ్ముడు శంకరయ్య(68)తోపాటు ఇతరుల పేర్లను కుటుంబ సభ్యుల జాబితాలో ఎక్కించారు.
మనస్పర్థలతో శంకరయ్య, భార్య, ముగ్గురు పిల్లలతో 30 ఏళ్లుగా ఇస్నాపూర్‌లో ఉంటున్నారు. సొంత గ్రామంలో ఆస్తుల నమోదు విషయం తెలుసుకున్న శంకరయ్య ఇటీవల పంచాయతీ సిబ్బందిని కలిశారు. తండ్రికి ఇద్దరు కొడుకులం ఉండగా... ఆస్తిని పెద్ద కొడుకు పేరుతోనే ఎందుకు నమోదు చేస్తారని? ఫొటో తీసుకుని తన పేరుపై కూడా నమోదు చేయాలని అడిగారు. ఇల్లు పెంటయ్య పేరుతో ఉండటంతో ఆయన ఫొటో తీసుకుని రికార్డుల్లో నమోదు చేశామని, శంకరయ్య పేరు కూడా కుటుంబ సభ్యుల జాబితాలో చేర్చామని పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్ పేర్కొన్నారు.
ఆస్తి తనకు దక్కదేమోనని మనస్తాపానికి గురైన శంకరయ్య సోమవారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహానికి ప్రభుత్వాసుపత్రిలో పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.