తెలంగాణ

telangana

ETV Bharat / international

'గాజా పునర్నిర్మాణానికి అమెరికా సాయం.. కానీ'

పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు బలోపేతం చేసేందుకు ఇజ్రాయెల్​లో పర్యటించారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. గాజా పునర్నిర్మాణానికి సాయం అందిస్తామని, అందులో హమాస్​ ఉండబోదని తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్​ ఫతాహ్​తో ఫోన్లో మాట్లాడారు.

By

Published : May 25, 2021, 6:31 PM IST

antony blinken
ఆంటోనీ బ్లింకెన్, అమెరికా విదేశాంగ మంత్రి

ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణల్లో భాగంగా.. తీవ్ర నష్టాన్ని చవిచూసిన గాజా ప్రాంతానికి అగ్రరాజ్యం సాయం అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ తెలిపారు. అయితే.. సాయం అందుకోవటంలో హమాస్​ ఉండబోదని స్పష్టం చేశారు. హమాస్​ను ఇజ్రాయెల్​తో పాటు అమెరికా ఉగ్రసంస్థగా పరిగణిస్తోంది. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు రంగం సిద్ధం చేసేందుకు పశ్చిమాసియా వెళ్లిన బ్లింకన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణలు అదుపు చేసే ముందు.. అనేక సమస్యలను పరిష్కరించాలి. అనేక సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ మేరకు తొలుత గాజా ప్రాంతాన్ని పునర్నిర్మించాలి. ఇందుకోసం అమెరికా శాయశక్తులా కృషి చేస్తుంది. పశ్చిమాసియా దేశాలతో కలిసి అమెరికా పనిచేయనుంది. కానీ, ఈ సహాయక చర్యల్లో భాగంగా.. హమాస్​కు ఎటువంటి సాయం చేసేందుకూ సిద్ధంగా లేము."

--ఆంటోనీ బ్లింకెన్, అమెరికా విదేశాంగ మంత్రి.

స్వేచ్ఛగా, సురక్షితంగా జీవించే హక్కు ఇజ్రాయెల్​ వాసులతో పాటు పాలస్తీనా ప్రజలకూ ఉందని బ్లింకెన్ అన్నారు. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం దీర్ఘకాలం కొనసాగేలా చూసేందుకు బ్లింకెన్.. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్​తో సంప్రదింపులు జరిపారు. జోర్డాన్, ఈజిప్టు దేశాల నాయకులతోనూ చర్చలు జరపనున్నారు.

బైడెన్ ఫోన్..

ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసితో ఫోన్లో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య శాంతి నెలకొల్పడంపై చర్చించారు. ఇరు ప్రాంతాల్లో ఘర్షణలు సద్దుమణిగించేందుకు ఈజిప్టు విశేష కృషి చేసిందని బైడెన్ అన్నారు.

ఇదీ చదవండి:ఒంటరి పురుషుల్లో క్యాన్సర్ ముప్పు అధికం!

ABOUT THE AUTHOR

...view details