తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2022, 7:03 PM IST

ETV Bharat / international

పాలించిన వారినే శాసించే స్థాయికి.. అంచెలంచెలుగా ఎదిగిన రిషి సునాక్

Rishi Sunak News : రిషి సునాక్‌.. సామాన్యుడి నుంచి బ్రిటన్‌ ప్రధాని స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి. కన్జర్వేటివ్ పార్టీలో కొత్తతరం నాయకుడిగా పేరుగాంచిన రిషి సునాక్‌.. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలం ఎదుర్కొంటున్న సమయంలో ఆర్థిక మంత్రిగా మంచి పనితీరు కనబర్చి అందరి మన్ననలు అందుకున్నారు. ఉన్నత స్థానాన్ని అధిరోహించినా తన భారతీయ మూలాలను రిషి ఎన్నడూ మరువలేదు.

uk prime minister candidates
uk prime minister candidates

Rishi Sunak News : ఇంగ్లండ్‌లోని సౌథంప్టన్‌ నగరంలో రిషి సునాక్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలోని భిన్న ప్రాంతాల నుంచి బ్రిటన్‌కు వలస వచ్చారు. వీరి మూలాలు భారత్‌లోని పంజాబ్‌లో ఉన్నాయి. రిషి తండ్రి యశ్వీర్.. కెన్యా నుంచి, రిషి తల్లి ఉష.. టాంజానియా నుంచి బ్రిటన్‌కు వచ్చారు. యశ్వీర్ వైద్యుడిగా పనిచేసేవారు. ఉష మందుల షాపును నడిపేవారు. రిషి మాత్రం ఆర్థిక రంగాన్ని కెరియర్‌గా ఎంచుకున్నారు. వెంచెస్టర్ కాలేజీలో రిషి చదువుకున్నారు. వేసవి సెలవుల్లో సౌథంప్టన్ కర్రీ హౌస్‌లో వెయిటర్‌గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ చదువుకున్నారు. స్టాన్‌ఫర్డ్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

రిషి సునాక్

2001 నుంచి 2004 మధ్య గోల్డ్‌మన్ సాక్స్‌లో విశ్లేషకుడిగా రిషి పనిచేశారు. రెండు హెడ్జ్ ఫండ్స్‌లలోనూ విధులు నిర్వర్తించారు.అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో రిషి పేరు కూడా వార్తల్లో నిలిచింది. ఇటీవల విడుదల చేసిన ఒక సర్వే ప్రకారం బ్రిటన్‌లోని 250 సంపన్న కుటుంబాల్లో రిషి సునక్ కుటుంబం ఒకటి. పుట్టుకతోనే రిషి సునక్ శ్రీమంతుడు కాదు. సౌథంప్టన్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆయన జన్మించారు. తనకు క్రికెట్, ఫుట్‌బాల్, ఫిట్‌నెస్, సినిమాలంటే ఇష్టమని తన వెబ్‌సైట్‌లో రిషి సునాక్‌ రాసుకొచ్చారు.

రిషి సునాక్

రిషికి రాజకీయాలు కొంచెం కొత్తే. 2014 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో రిచ్‌మండ్ నుంచి పోటీచేసి ఆయన గెలిచారు. 2017, 2019 ఎన్నికల్లోనూ ఆ స్థానంలో ఆయన గెలిచారు. మొదట కేంద్ర సహాయక మంత్రిగా, ఆ తర్వాత ఛాన్సలర్‌గా పనిచేశారు. బ్రిటన్ క్యాబినెట్‌లో ఛాన్సలర్‌ అనేది రెండో ముఖ్యమైన మంత్రిత్వ శాఖ. ఈ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తి రిషి కావడం విశేషం. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేయాలని పిలుపునిచ్చిన వారిలో రిషి ఒకరు. కన్జర్వేటివ్ పార్టీ కొత్తతరం నాయకుడిగా ఆయనను పిలుస్తుంటారు. బ్రెగ్జిట్, ఆ తరువాత కరోనా సంక్షోభంతో బ్రిటన్ ఆర్థికవ్యవస్థ గడ్డుకాలం ఎదుర్కొంటున్న సమయంలో 2020లో ఆ దేశ ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టారు రిషి సునక్. ఆ సమయంలో ఆయన పనితీరుకు ప్రశంసలు దక్కాయి. రిషి సునాక్‌ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోన్న సమయంలో ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి, సుధా మూర్తిల కుమార్తె అక్షతా మూర్తిని కలిశారు. అనంతరం 2009లో బెంగళూరులో వీరి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు.

రిషి సునాక్

తాను హిందువునని రిషి సునక్ గర్వంగా చెబుతారు. బయట కూడా ఆయన తన మత సంప్రదాయాలను, విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు. చిన్నప్పుడు తరచూ రిషి సునక్ దేవాలయానికి వెళ్తూ ఉండేవారు. రిషిని చూసిన వారు.. ఆయన చాలా సాధారణ వ్యక్తి అని, చాలా కష్టపడి ఈ స్థాయికి చేరారని అంటారు. భిన్నత్వానికి బ్రిటన్ సమాజం ఒక చక్కని ఉదాహరణ అని చెబుతుంటారు. రిషి సునక్ ఆ దేశ ప్రధానిగా ఎన్నికకావడంతో ఆ ఇమేజ్ మరింత పెరిగింది.

ఇవీ చదవండి:బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి సునాక్! దీపావళి రోజున గుడ్​న్యూస్​!!

'ప్రధాని పదవికి పోటీ చేస్తున్నా'.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్​

ABOUT THE AUTHOR

...view details