తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్‌.. ఇంటెలిజెన్స్​ సమాచారం లీక్​ అయిందా? - Chinese spy balloon updates

అమెరికా అణు స్థావరాలపై చైనా నిఘా పెట్టిందా? అమెరికా గగనతలంలో ఓ భారీ బెలూన్‌ను వదిని దాని ద్వారా రహస్యాలు సేకరించే పనిలో ఉందా? బెలూన్‌ ఎగరడాన్ని అమెరికా రక్షణ శాఖ నిర్ధారించింది. అయితే దాని ద్వారా ఏ మేరకు నిఘా పెట్టారనే అంశంపై అధ్యయనం చేస్తోంది. కూల్చివేస్తే..ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే అంశాన్నికూడా పరిశీలిస్తోంది.

Tracking suspected Chinese spy balloon over US Pentagon
Tracking suspected Chinese spy balloon over US Pentagon

By

Published : Feb 3, 2023, 11:00 AM IST

Updated : Feb 3, 2023, 3:27 PM IST

అమెరికాలోని అణు స్థావరంపై చైనా వదిలిన ఓ భారీ హై ఆల్టిట్యూడ్‌ బెలూన్‌ను... అక్కడి అధికారులు గుర్తించడం కలకలం రేపింది. ఈ విషయాన్ని పెంటగాన్‌ స్వయంగా వెల్లడించింది. ఈ బెలూన్‌ను అమెరికా నిఘా వర్గాలు.. కొంతకాలంగా ట్రాక్‌ చేస్తున్నాయి. వాణిజ్య విమానాలు ప్రయాణించే ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో ఇది ప్రయాణిస్తోందని పెంటగాన్‌ ప్రతినిధి పాట్రిక్‌ రైడర్‌ పేర్కొన్నారు. అది ఉత్తర అమెరికా గగనతలంలో ప్రయాణిస్తోంది. దీనిని కూల్చేస్ శకలాలు నేలపై పడి ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సీనియర్‌ అధికారులు అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. ఈ అంశంతోపాటు తాజా పరిస్థితిని ఆయనకు వివరించారు. ప్రస్తుతం ఈ బెలూన్‌ అమెరికాలోని చాలా కీలక ప్రదేశాల మీదుగా ఎగురుతోందని.. అమెరికా రక్షణశాఖ వర్గాలు కూడా వెల్లడించాయి. దీని ద్వారా పెద్దగా ఇంటెలిజెన్స్‌ సమాచారం లీక్‌ కాకపోవచ్చని.. ఆ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

బుధవారం ఈ బెలూన్‌ను అమెరికా పశ్చిమ ప్రాంతంలోని మోంటానాపై గుర్తించారు. ఇది కెనడాను దాటుకొని.. అలాస్కా గగనతలంపై ఎగురుతోందని అధికారులు తెలిపారు. శ్వేత సౌధం నుంచి ఆదేశాలు రాగానే దీనిని కూల్చివేసేందుకు ఇప్పటికే ఎఫ్‌-22 సహా ఇతర ఫైట్‌ జెట్‌లను సిద్ధం చేస్తున్నారు. అమెరికాలో తక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో.. మోంటానా కూడా ఒకటి కాగా.. అమెరికాలో ఉన్న మూడు భూగర్భ అణు క్షిపణి స్థావరాల్లో ఒకటి ఇక్కడే మాల్మ్‌స్ట్రోమ్‌ వైమానిక స్థావరం వద్ద ఉంది. ఈ నిఘా బెలూన్‌ దానిపై నుంచి ఎగిరి ఉంటుందని తాము భావిస్తున్నట్లు రక్షణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ బెలూన్‌ విషయాన్ని అమెరికా అధికారులు వాషింగ్టన్‌ డీసీలోని చైనా దౌత్య సిబ్బందికి తెలిపారు. ప్రస్తుతం బెలూన్‌ ఎగురుతున్న ప్రాంతాన్ని పెంటాగాన్‌ గోప్యంగా ఉంచింది. గతంలో కూడా ఇలా బెలూన్లతో నిఘా సమాచారం సేకరించిన ఘటనలు ఉన్నాయి. కానీ, ఈ సారి మాత్రం ఈ బెలూన్‌ చాలా కాలం పాటు అమెరికా గగనతలంలోనే ఉంది.

బెలూన్​ వార్తలపై స్పందించిన డ్రాగన్​
అమెరికా అణు స్థావరాలపై చైనాకు చెందిన నిఘా బెలూన్లు ఎగురుతున్నాయని వస్తున్న వార్తలపై డ్రాగన్ స్పందించింది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని.. దానిపై స్పష్టత వచ్చేవరకు రాజకీయ నాయకులు గానీ, ప్రజలు గానీ సంయమనం పాటించాలని పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలకు చైనా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని.. ఏ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా భూభాగాన్నిగానీ, గగనతలాన్ని గానీ ఉల్లంఘించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఈ నెలలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. చైనా పర్యటన షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందా లేదా అనే దానిపై సమాచారం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. వాణిజ్యం, తైవాన్‌ అంశం, మానవ హక్కులు, దక్షిణ చైనా సముద్రంలో చైనా వాదనలపై ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపరిచేందుకు చైనాలో బ్లింకెన్ పర్యటించనున్నారు.

Last Updated : Feb 3, 2023, 3:27 PM IST

ABOUT THE AUTHOR

...view details