Sikh Death In Pakistan: పాకిస్థాన్‌లో మైనారిటీలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు రాజధాని పెషావర్‌కు సమీపంలో ఇద్దరు సిక్కు పౌరులను దుండగులు కాల్చి చంపారు. సర్బాంద్ పట్టణంలోని బాబా తాల్ బజార్‌లో దుకాణం నిర్వహిస్తోన్న సల్జీత్ సింగ్(42), రంజీత్ సింగ్ (38) లపై దుండగులు కాల్పులు జరపడం వల్ల వారు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగులు బైకుపై పారిపోయారు. అయితే, ఈ దాడులకు పాల్పడింది ఎవరనే విషయం తెలియనప్పటికీ ఉగ్రచర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ అకిక్ హుస్సేన్ మీడియాకు వెల్లడించారు.
ఖండించిన పాక్ ప్రధాని..: ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో జరిగిన ఈ దాడిని పాక్ ప్రధాని హెషబాజ్ షరీఫ్ ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు వారికి శిక్షపడేలా చూడాలని ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి మహమ్మూద్ ఖాన్‌ను ఆదేశించారు. ముస్లిమేతర పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న ఆయన ఉగ్రచర్యలను సహించేది లేదన్నారు. మరోవైపు మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వం విఫలమైందని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే నివేదిక అందించాలని ప్రావిన్సు చీఫ్ సెక్రటరీతోపాటు ఐజీపీలను ఆదేశించారు. ఇక సిక్కలపై దాడి ఘటనపై స్పందించిన పాకిస్థాన్ విదేశీ వ్వవహారాల శాఖ మంత్రి బిలావల్ భుట్టో.. ఈ దారుణానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.