Russia Ukraine War : ద్విచక్ర వాహనాల చప్పుడు వింటే ప్రస్తుతం ఉక్రెయిన్ వాసులు ఉలిక్కి పడుతున్నారు. ఏదో మోపెడ్ దూసుకొస్తున్న చప్పుడు వారి చెవినపడగానే సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఉక్రెయిన్ చేతికి అమెరికా జావెలిన్లు, హైమార్స్ దీర్ఘశ్రేణి శతఘ్నులు వచ్చాక రష్యా భారీగా ఆయుధాలు, ట్యాంకులను నష్టపోయింది. ఈ నేపథ్యంలో కారు చౌక ఆయుధాలతో ఉక్రెయిన్‌పై దాడులు చేసేలా మాస్కో వ్యూహం సిద్ధం చేసింది. ఇరాన్ నుంచి చౌకగా ఆయుధాలు దిగుమతి చేసుకొని ఉక్రెయిన్‌పై ఎక్కుపెట్టింది. ఇప్పుడు ఇది కీవ్‌కు ముప్పుగా పరిణమించింది.
కీవ్‌పై సోమవారం ఉదయం కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు సార్లు దాడులు జరిగాయి. మధ్య కీవ్‌లోని నివాస ప్రాంతాలపై ఆత్మాహుతి డ్రోన్లు దాడి చేసినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యలయ ప్రధాన అధికారి ఆండ్రీ యర్మాక్ పేర్కొన్నారు. ప్రస్తుతం దాడులు జరిగిన ప్రదేశాలకు ఫైర్ డిపార్ట్‌మెంట్, వైద్య సిబ్బంది చేరుకొన్నారని చెప్పారు. ఈ దాడుల్లో ఎంత మంది గాయపడ్డారో మాత్రం వెల్లడించలేదు. కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపించిన వారం తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. గత వారం దాడుల్లో దాదాపు 19 మంది మరణించగా.. 105 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకొన్న డ్రోన్లతో ఈ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు. ఇవి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
దాడికి ముందు మోపెడ్ శబ్దం..
ఉక్రెయిన్ చేతికి చౌకగా తయారయ్యే స్విచ్ బ్లేడ్ డ్రోన్లు రావడంతో.. రష్యా కూడా చౌక ఆయుధాలపై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో ఇరాన్ తయారీ షహీద్ సిరీస్ డ్రోన్లను క్రెమ్లిన్ ఎంచుకొంది. ఈ డ్రోన్లలో మోపెడ్లలో వాడే 50 హార్స్‌పవర్ 2స్ట్రోక్ ఇంజిన్లను వినియోగిస్తున్నారు. చాలా వరకు స్మార్ట్ ఫోన్ల విడిభాగాలు, కంప్యూటర్ చిప్‌లను కూడా వీటి తయారీకి ఉపయోగించారు. ఇవి గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మోపెడ్ల మాదిరి చప్పుడు స్పష్టంగా వినిపిస్తన్నట్లు కీవ్ వాసులు 'రేడియో ఫ్రీ యూరోప్ రేడియో లిబర్టీ'కి వెల్లడించారు. డ్రోన్ల శిథిలాల్లో 2స్ట్రోక్ ఇంజిన్లను గుర్తించారు. రష్యా సైనికులు కూడా ఈ డ్రోన్లను ముద్దుగా 'మోపెడ్లు' అని పిలుచుకొంటున్నారు. వీటిని ట్రక్కు పై నుంచి సులువుగా ప్రయోగించవచ్చు. మరోవైపు ఇరాన్ మాత్రం రష్యాకు ఎటువంటి ఆయుధాలను సరఫరా చేయడంలేదని చెబుతోంది. కానీ, డ్రోన్ల భాగాలపై ఇరాన్ తాయరీ చిహ్నాలను ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు.