Pakisthan New President: పాకిస్థాన్‌లో మార్చి8న మొదలైన రాజకీయ డ్రామాకు నేడు(సోమవారం) తెరపడనుంది. అవిశ్వాస తీర్మానంతో ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను విపక్షాలు తొలగించిన నేపథ్యంలో కొత్త ప్రధాని ఎంపికకు వీలుగా ఆ దేశ జాతీయ అసెంబ్లీ నేడు భేటీ కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జాతీయ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ తరఫున మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ నామినేషన్ వేశారు. పాక్ జాతీయ అసెంబ్లీలో మొత్తం స్ధానాల సంఖ్య 342 కాగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్య 172. అయితే ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశానికి అనుకూలంగా 174 మంది మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ సంఖ్యా బలం ప్రకారం షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధాని కావడం లాంఛనమే కానుంది. షెహబాజ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సోదరుడు. ఆదివారం షెహబాజ్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, పాక్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ బుట్టో జర్దారీతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలను చర్చించారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కలిసి పని చేసే అంశం సహా ఎన్నికల సంస్కరణలపై చర్చలు జరిపారు.
ప్రత్యేక నిఘా.. పాక్ జాతీయ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆ దేశ విమానాశ్రయాల్లో నిఘా పెంచారు. ప్రధాన దర్యాప్తు సంస్ధ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇమ్మిగ్రేషన్ సిబ్బంది పలు చోట్ల మోహరించారు. ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు ఎవరూ నిరభ్యంతర పత్రం లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇమ్రాన్ మూడో భార్య స్నేహితురాలు ఫరాఖాన్‌పై అవినీతి ఆరోపణలు ఉండగా, భారీగా నగదుతో ఆమె వారం క్రితం దుబాయ్ పారిపోయిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అటు ఇమ్రాన్ సహా ఆయన మంత్రివర్గంలో పని చేసిన సభ్యులు దేశం విడిచివెళ్లరాదని ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ నేడే జరగనుంది. అటు ఇమ్రాన్‌ఖాన్ తొలగింపును వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు దేశంలోని పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.