భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించేందుకు కృషి చేయాలని ఇరు దేశాలు తీర్మానించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ ఈమేరకు గురువారం చర్చలు జరిపినట్లు రష్యాలోని భారత రాయబారి కార్యాలయం వెల్లడించింది. అఫ్గానిస్థాన్‌పై రష్యా నిర్వహించిన ఐదో జాతీయ భద్రతా మండల కార్యాదర్శుల సమావేశం కోసం భారత జాతీయ సలహాదారు అజిత్ ఢోబాల్ గురువారం మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆయన కలుసుకున్నారు. ఆ సమయంలో ఇరుదేశాలకు సంబంధించి ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చించుకున్నట్లు మాస్కోలోని భారత రాయబారి కార్యాయలం ట్విట్టర్ ద్వారా తెలిపింది.
రష్యా అధ్యక్షుడితో అజిత్ ఢోబాల్ భేటి.. కీలక విషయాలపై చర్చ - అఫ్గానిస్థాన్ పై రష్యా నిర్వహించిన సమావేశం
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాలకు సంబంధించి కీలకాంశాలపై చర్చించుకున్నారు. ఈ విషయాన్ని మాస్కోలోని భారత రాయబారి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
అఫ్గానిస్థాన్‌ను ఏ దేశం కూడా ఉగ్రవాద ఎగుమతి దేశంగా ఉపయోగించుకోకూడదని అజిత్ ఢోబాల్ అన్నారు. అఫ్గాన్‌లో ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అఫ్గాన్ క్షిష్ట పరిస్థితి ఎదుర్కొంటోందని.. దీనికి అన్ని సభ్యదేశాల సహకారం అవసరమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అఫ్గాన్ ప్రజలకు అవసరమైన సమయంలో సహకారం అందిస్తుందని అజిత్ ఢోబాల్ హామీ ఇచ్చారు. అఫ్గాన్‌లోని ప్రజల పరిస్థితి రోజురోజుగా దిగజారుతోందని.. కొంచెం కూడా మెరుగు పడటం లేదని పుతిన్ తెలిపారు. రష్యా నిర్వహించిన ఈ సమావేశానికి భారత్‌తో పాటు ఇరాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, చైనా, తజికిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.