Germany gas crisis: ఐరోపాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరొందిన జర్మనీ ప్రస్తుతం గ్యాస్ కష్టాలను ఎదుర్కొంటోంది. తొలి నుంచి గ్యాస్ దిగుమతిపై రష్యాపై ఆధారపడుతూ వస్తోన్న జర్మనీ, ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం ప్రకటించినప్పటి నుంచి.. గ్యాస్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రష్యాపై అమెరికా సహా ఐరోపా దేశాలు మూకుమ్మడిగా ఆంక్షలు విధించడం వల్ల పుతిన్ సైతం ప్రతిదాడిగా గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. దీంతో రష్యా నుంచి గ్యాస్ సరఫరా స్తంభించిపోయి జర్మనీ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఇది జర్మనీ ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావం చూపుతోంది.
దేశంలో గ్యాస్ కొరత తీవ్రతరం కావడం వల్ల జర్మనీ అప్రమత్తమైంది. దేశంలో గ్యాస్ వినియోగాన్ని పరిమితం చేసే మూడు దశల ప్రణాళికల్లో రెండో ఫేజ్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా పరిశ్రమలకు, గృహాలకు సరఫరా చేసే గ్యాస్ ధరను పెంచేందుకు సంబంధింత గ్యాస్ సరఫరా సంస్థలకు జర్మనీ ప్రభుత్వం అనుమతించినట్లైంది. ఫేజ్-2 అమలు వల్ల గ్యాస్ ధరలు పెరిగి గ్యాస్ వినియోగం తగ్గుతుందని జర్మనీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అంతేగాక తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి అదనంగా 15.76 బిలియన్ డాలర్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.