china commends India: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు సహాయం చేయడంలో భారత్ ఎంతో కృషి చేసిందంటూ చైనా ప్రశంసలు కురిపించింది. ఇక చైనా తన వ్యూహాత్మక దృష్టిని దక్షిణాసియా నుంచి ఆగ్నేయాసియా వైపు మళ్లించిందని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స చేసిన వ్యాఖ్యలను ఖండించింది. అయినప్పటికీ దక్షిణాసియా తమకు ప్రాధాన్యత కలిగిన ప్రాంతమేనని స్పష్టం చేసింది. శ్రీలంకలో భారీ పెట్టుబడులు పెట్టిన చైనా.. తీవ్ర సంక్షోభంలో ఉన్నవేళ సహాయం చేసేందుకు సంకోచిస్తోందని ప్రశ్నలు వస్తోన్న నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈవిధంగా స్పందించింది.
'తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటున్న తరుణంలో శ్రీలంకను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం గొప్ప ప్రయత్నాలు చేసిందని గుర్తించాం' అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ పేర్కొన్నారు. అంతే కాకుండా సంక్షోభాల్లో చిక్కుకున్న శ్రీలంకను ఆదుకునేందుకు భారత్‌తోపాటు అంతర్జాతీయ సమాజం చేస్తోన్న ప్రయత్నాల్లో భాగస్వామ్యం అయ్యేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స.. దుర్భర పరిస్థితుల్లో చైనా నుంచి ఆశించిన మద్దతను పొందలేకపోవడాన్ని ఇటీవల ప్రస్తావించారు.
'గతంలో మాదిరిగా చైనా ఈ ప్రాంతంపై ఆసక్తి చూపడం లేదు. వారి వ్యూహాత్మక దృష్టి దక్షిణాసియా నుంచి ఆగ్నేయాసియా దేశాలైన ఫిలిప్పైన్స్, వియత్నాం, కాంబోడియాతోపాటు ఆఫ్రికా దేశాల వైపు మళ్లించిందని అనుకుంటున్నాను. పాకిస్థాన్‌పైనా చైనా ఆసక్తి తగ్గిందని భావిస్తున్నా' అని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పేర్కొన్నారు. ఇలా శ్రీలంక అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఖండించిన చైనా.. అటువంటిదేమీ లేదని వ్యాఖ్యానించింది.