కరోనా వైరస్ కోరలు పీకే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేస్తున్న ప్రయోగాలపైనే యావత్తు ప్రపంచం దృష్టి సారించింది. అయితే, ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా ధరపరంగా అది ఎంతమందికి అందుబాటులో ఉంటుందన్న సందేహం వ్యక్తం అవుతోంది. దీనిపై పరిశోధనకు నేతృత్వం వహించిన వారిలో ఒకరైన ప్రొఫెసర్ అడ్రియాన్ హిల్ కీలక విషయాలు పంచుకున్నారు.
వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందజేయాలన్న లక్ష్యంతోనే పరిశోధనలు సాగుతున్నాయని హిల్ తెలిపారు. ప్రయోగాలు ఫలవంతమైతే.. ధరని నియంత్రించే విధంగా డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తిని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తక్కువ ధర, ఎక్కువ మందికి చేర్చేందుకు సౌకర్యంగా ఉండడమే లక్ష్యంగా పరిశోధనని సాగిస్తున్నామని తెలిపారు. ‘‘ఈ వ్యాక్సిన్ ఖరీదు తక్కువే ఉంటుంది. ఇది సింగిల్ డోస్ వ్యాక్సిన్. గ్లోబల్ సప్లై చైన్‌కి అందుబాటులో ఉంటుంది. దీంతో వివిధ ప్రదేశాల్లో దీన్ని తయారు చేస్తారు. మొదట్నుంటి మా ప్రణాళిక ఇదే’’ అని హిల్స్ వివరించారు. ఇప్పటికే 10 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయని.. సెప్టెంబరు నాటికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు.