తెలంగాణ

telangana

ETV Bharat / international

విమానాశ్రయాన్ని ధ్వంసం చేసిన రష్యా.. నో ఫ్లై జోన్‌పై జెలెన్‌స్కీ మరోసారి విజ్ఞప్తి

Russia Ukraine War
ఉక్రెయిన్​- రష్యా యుద్ధం

By

Published : Mar 6, 2022, 6:51 AM IST

Updated : Mar 7, 2022, 12:56 AM IST

00:54 March 07

ఉక్రెయిన్‌లోని సెంట్రల్‌ వెస్ట్రన్‌ రీజియన్‌ రాజధాని అయిన విన్నిట్సియాలో ఉన్న విమానాశ్రయంపై ఆదివారం రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. రష్యా సేనలు ఎనిమిది ఆర్మీ రాకెట్లతో విరుచుకుపడి విమానాశ్రయాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సైతం వైరల్‌గా మారింది.

ఈ నేపథ్యంలోనే జెలెన్‌స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎయిర్‌పోర్టులపైనా రష్యా బాంబులు వేస్తోందని, ఒడెస్సా నగరంపైనా రాకెట్‌ దాడులకు రష్యా సేనలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ‘నో ఫ్లై జోన్‌’ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. దాడుల కట్టడికి ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఐరోపా దేశాలను విజ్ఞప్తి చేశారు. ‘ప్రతిరోజూ ఈ విషయాన్ని మళ్లీమళ్లీ అడుగుతున్నాం. రష్యన్ క్షిపణులు, యుద్ధ విమానాలు, వారి ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించేందుకు ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేయండి. అలా చేయకపోతే కనీసం ఆయుధాలనైనా ఇవ్వండి. ఇలా కాకుండా మేమంతా చనిపోవాలని మీరు భావిస్తున్నారా?’ అంటూ ఆవేదన చెందారు.

21:10 March 06

పుతిన్​ పతనానికి.. బ్రిటన్​ ప్రధాని ఆరు అంశాల ప్రణాళిక విడుదల

ఉక్రెయిన్ పై సైనిక చర్య విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్​ను ఓడించేందుకు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఆదివారం ఆరు అంశాల ప్రణాళికను ప్రకటించారు.

  • ఉక్రెయిన్​ కోసం అంతర్జాతీయ మానవతా సాయాన్ని కూడగట్టాలి.
  • ఉక్రెయిన్​ తన స్వీయ రక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలి.
  • రష్యా పై ఆర్థిక ఒత్తిడి మరింత పెంచాలి.
  • ఉక్రెయిన్​లో రష్యా తాను చేస్తున్న పనులను సాధారణంగా పరిగణించడాన్ని అడ్డుకోవాలి.
  • ఉద్రిక్తతల తగ్గుముఖం కోసం ప్రపంచ దేశాలు దౌత్యపరమైన మార్గాలను అనుసరించాలి. అదీ.. ఉక్రెయిన్ చట్టబద్ధమైన ప్రభుత్వ పూర్తి భాగస్వామ్యంతో మాత్రమే.
  • యూరో అట్లాంటిక్​ ప్రాంతంలో భద్రతను బలోపేతం చేసేందుకు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాలి.

19:59 March 06

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య చర్చలు జరిగాయి. ఇరువురు గంట 45 నిమిషాల పాటు ఫోన్​లో సంభాషించుకున్నారు.

15:58 March 06

వలస సంక్షోభం

ఉక్రెయిన్​లో యుద్ధ సంక్షోభం వల్ల అనేక మంది ప్రజలు వలస వెళ్తున్నారు. ఇప్పటివరకు 15 లక్షల మంది దేశం దాటి వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం ఇదేనని పేర్కొంది.

14:22 March 06

ఉక్రెయిన్​లోని భారతీయులకు కీలక సూచనలు

ఉక్రెయిన్​లో ఇంకా మిగిలి ఉన్న భారతీయులకు అక్కడి భారత రాయబార కార్యాలయం ఆదివారం కీలక సూచనలు జారీ చేసింది. పేరు, ఉక్రెయిన్​లోని ఏ నగరంలో ఉన్నారు? అనే తదితర అంశాలతో అందుబాటులో ఉంచిన ఓ దరఖాస్తును అత్యవసర ప్రాతిపదికన నింపాలంటూ సూచించింది. ఈ మేరకు గూగుల్​ డ్యాక్యుమెంట్​ను జతపరిచింది.

చివరి దశకు ఆపరేషన్​ గంగ

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులను తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్​ గంగ చివరి దశకు చేరుకుంది. ఈరోజు చివరి విమానం వెళ్లనున్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రాయబార కార్యాలయం కల్పించిన సౌకర్యాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో సొంత ఖర్చులతో నివసిస్తున్న విద్యార్థులు.. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ కేంద్రానికి 10-12 గంటల మధ్య వెంటనే చేరుకోవాలని స్పష్టం చేసింది.

08:55 March 06

'రష్యాపై పోరాడేందుకు సై అంటున్న ఉక్రెయిన్​ యువకులు'

రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ సైన్యంలో చేరేందుకు ఉక్రెయిన్​లోని వందల మంది పురుషులు కీవ్​లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే మిలిటరీ ఆపరేషన్​ కోసం 18-60 వయసు వారు దేశం విడిచి వెళ్లటాన్ని నిషేధించింది ఉక్రెయిన్​. ఈ క్రమంలో వొలొదిమిర్​ ఒనిస్కో వంటి వారు రష్యాతో పోరాడేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. "మేము ఇక్కడ ఎందుకు ఉన్నామో తెలుసు. మా దేశాన్ని ఎందుకు కాపాడుకుంటున్నామో తెలుసు. మా పౌరులు రష్యా మిలిటరీపై పోరాడుతున్నాయి. మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు. అందుకే ఈ పోరాటంలో విజయం సాధిస్తాం" అని పేర్కొన్నారు ఒనిస్కో.

ఉక్రెయిన్​కు సాయం చేసేందుకు బ్రిటన్​ ఆర్మీ మాజీ అధికారి మార్క్​ ఐరెస్​.. ఆ దేశం తరలివెళ్లారు. ఉక్రెయిన్​ ప్రజలు సైన్యం చేస్తున్న పోరాటంపై స్ఫూర్తి పొందారని, అది రోజు రోజుకు పెరుగుతోందని చెప్పారు.

07:12 March 06

బ్లింకెన్​తో ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రి భేటీ

రష్యా భీకర దాడులకు తెగబడుతున్న తరుణంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్​తో పొలాండ్​ సరిహద్దులో భేటీ అయ్యారు ఉక్రెయిన్​ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా. రష్యాపై ఆంక్షలు, కీవ్​ రక్షణ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై చర్చించారు. ' ఉక్రెయిన్​-పొలిస్​ సరిహద్దులో యూఎస్​ విదేశాంగ మంత్రి బ్లింకెన్​ను కలిశాను. ఉక్రెయిన్​కు అవసరమైన ఆయుధాలను అందించటం, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించి, ఒత్తిడి పెంచే మార్గాలపై చర్చించాం. ' అని ట్వీట్​ చేశారు కులేబా. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయని, రష్యాపై విధించిన ఆంక్షలను కఠినతరం చేయటంపై ఇరుదేశాలు సమ్మతించాయన్నారు. ఉక్రెయిన్​ ప్రజలకు అమెరికాతో పాటు యావత్​ ప్రపంచం అండగా ఉంటుందని భరోసా కల్పించారు బ్లింకెన్​. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

రష్యా చేతిలో బంధీగా 4 లక్షల మంది ఉక్రెనియన్లు!

మరియుపోల్​లోని పౌరులను తరలించేందుకు కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా మాట తప్పిందని ఆరోపించారు ఆ నగర మేయర్​ వదిమ్​ బాయ్​చెంకో. నగరాన్ని రష్యా నిర్బంధించి.. మానవతా కారిడార్​కు నిరాకరించినట్లు చెప్పారు. ఇప్పటికే నగరంలో నీరు, విద్యుత్తు సౌకర్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా బలగాల చేతిలో సుమారు 4 లక్షల మంది నగరవాసులు బంధీగా ఉన్నారని తెలిపారు.

అమెరికా అధ్యక్షుడికి జెలెన్​స్కీ ఫోన్​.. రక్షణ, ఆర్థిక మద్దతుపై చర్చ

రష్యా దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో ఫోన్​లో మాట్లాడారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ. ఉక్రెయిన్​కు రక్షణ, ఆర్థిక మద్దతు వంటి అంశాలపై చర్చించారు. యుద్ధం మొదలైన తర్వాత బైడెన్​తో జెలెన్​స్కీ ఫోన్​లో మాట్లాడటం ఇది రెండోసారి. ' అమెరికా అధ్యక్షుడితో మరోమారు మాట్లాడాను. ఉక్రెయిన్​కు రక్షణ, ఆర్థిక మద్దతు, రష్యాపై ఆంక్షల కొనసాగింపు వంటి కీలక అంశాలు మా అజెండాలో ఉన్నాయి.' అని ట్వీట్​ చేశారు జెలెన్​స్కీ.

మరోవైపు.. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య అర్ధగంట పాటు చర్చలు జరిగినట్లు శ్వేతసౌధం ప్రకటించింది.

06:52 March 06

కొనసాగుతున్న ఆంక్షలు..

ఉక్రెయిన్​పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఆ దేశంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి వీసా, మాస్టర్​కార్డ్​. రానున్న రోజుల్లో పూర్తిస్థాయిలో తమ సేవలను ఆపేస్తామని ప్రకటించాయని ఉక్రెయిన్​ మీడియా తెలిపింది. మరోవైపు.. రష్యాలోని అన్ని స్టోర్లలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు పూమా తెలిపింది. ఇప్పటికే రష్యాకు సరఫరా ఆగిపోయినట్లు పేర్కొంది.

పుతిన్​తో ఇజ్రాయెల్​ ప్రధాని..

ఉక్రెయిన్​పై రష్యా దాడుల నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్​తో భేటీ అయ్యారు ఇజ్రాయెల్​ ప్రధాని నెఫ్తాలీ బెన్నెట్​. ఉక్రెయిన్​తో చర్చలు చేపట్టాలని కోరినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కీవ్​, మాస్కోలతో ఇజ్రాయెల్​కు మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. చర్చల దిశగా రష్యాతో చర్చలు చేపట్టాలని ఆ దేశాన్ని కోరింది ఉక్రెయిన్​.

మూడో అణు కేంద్రం దిశగా రష్యన్​ సేనలు

ఉక్రెయిన్​లోని రెండు అణు విద్యుత్తు కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకున్న రష్యన్​ సేనలు.. మూడో న్యూక్లియర్​ ప్లాంట్​ దిశగా వేగంగా కదులుతున్నాయని అమెరికా సేనేటర్లతో అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలెన్​స్కీ చెప్పారు. మైకోలేవ్​కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుజ్నౌక్రైన్స్​ అణు కేంద్రానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జపోరిజ్జియా, చెర్నోబిల్​ అణు విద్యుత్తు కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి రష్యన్​ దళాలు.

06:30 March 06

Russia Ukraine War: ఉక్రెయిన్​- రష్యా యుద్ధం లైవ్​ అప్డేట్స్​

Russia Ukraine War: ఉక్రెయిన్​- రష్యా మధ్య మూడో దఫా చర్చలు

ఉక్రెయిన్​పై రష్యా చేపట్టిన సైనిక చర్య కొనసాగుతోంది. క్షిపణులు, రాకెట్లు, బాంబులతో విరుచుకుపడుతున్నాయి రష్యన్​ సేనలు. మరోవైపు.. శాంతి చర్చలు జరుగుతున్నా ఎలాంటి ఫలితం లభించటం లేదు. ఈ క్రమంలోనే మరో దఫా చర్చలకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. మూడో దఫా చర్చలు సోమవారం(మార్చి 7న) జరగనున్నాయని ఉక్రెయిన్​ చర్చల బృంద సభ్యుడు డేవిడ్​ అరఖమియా తెలిపారు. కాల్పుల విరమణ, పౌరులను సురక్షితంగా తరలించే అంశంపై ప్రధానంగా ఈ చర్చలు జరగనున్నాయని తెలిపారు.

Last Updated : Mar 7, 2022, 12:56 AM IST

ABOUT THE AUTHOR

...view details