russia -ukraine discussions శాంతి చర్చలతో యుద్ధం ఓ కొలిక్కి వస్తుందన్న ఆశలు సోమవారం నీరుగారాయి. ఎలాంటి ఒప్పందం లేకుండానే రష్యా-ఉక్రెయిన్ తొలివిడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రెండు దేశాల బృందాలు బెలారస్ సరిహద్దు సమీపంలో దాదాపు ఐదు గంటలపాటు చర్చలు జరిపాయి. తక్షణం యుద్ధాన్ని విరమించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. రక్షణ మంత్రి, ఇతర ఉన్నతాధికారుల్ని ఉక్రెయిన్ ఈ భేటీకి పంపించగా, రష్యా అధ్యక్షుని సాంస్కృతిక సలహాదారుడిగా ఉన్న మాజీ మంత్రి వ్లాదిమిర్ మెడిన్స్కీ నేతృత్వంలో ఆ దేశ బృందం హాజరైంది. చర్చలను రష్యా ఎలా చూస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. ప్రాథమిక డిమాండ్లపై ఇరువర్గాలు తమ పట్టు సడలించపోవడంతో చర్చల్లో ఎలాంటి ముందడుగు పడలేదు. త్వరలోనే మరో విడత సమావేశం జరగవచ్చని భావిస్తున్నారు. ప్రత్యేక విధానం ద్వారా తమ దేశాన్ని వెంటనే ఐరోపా సమాజం (ఈయూ)లో చేర్చుకోవాల్సిందిగా కోరుతూ సంబంధిత దరఖాస్తుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేయడం కీలక పరిణామం. ఇది ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోయొచ్చన్న విశ్లేషణలూ వెలువడుతున్నాయి. దరఖాస్తు చేస్తున్న ఫొటోను స్వయంగా అధ్యక్షుడే పత్రికలకు విడుదల చేశారు.
రవ్వంత విరామం..
సోమవారం రణభేరికి కొంతమేర విరామం లభించింది. దూకుడును రష్యా ఒక్కసారిగా తగ్గించింది. ఉక్రెయిన్ బలగాలు కూడా సంయమనం పాటిస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై ఐరాస రెండు కీలక సమావేశాలు నిర్వహించింది. వాటిలో రెండు దేశాల ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రత్యేక దూతలను నియమించింది. వివిధ దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షల ప్రభావంతో విలవిల్లాడుతున్న రష్యా తాజాగా మరిన్ని దేశాల విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
క్షిపణులు, ఆయుధాలు ఇస్తామన్న అమెరికా
ఉక్రెయిన్‌కు స్టింగర్ క్షిపణుల్ని, ఇతర ఆయుధాలను ఇస్తామని అమెరికా, జర్మనీ ప్రకటించాయి. ట్యాంకు విధ్వంసక ఆయుధాలు, పేలుడు పదార్థాలు వంటివి ఐరోపా సమాజం సరఫరా చేస్తోంది. యుద్ధ విమానాలను సరఫరా చేయాలన్న ఉక్రెయిన్ అభ్యర్థనను పశ్చిమ దేశమొకటి పరిశీలిస్తోందని ఐరోపా అధికారి ఒకరు తెలిపారు. ఆయుధాలు అందకుండా నౌకలను అడ్డుకోవడం రష్యాకు ప్రాధాన్య అంశంగా మారింది. కీవ్‌తో పాటు ఉక్రెయిన్‌లోని లుట్స్క్, ఇవానో ఫ్రాంకివ్స్క్, చెర్నిహైవ్, ఖార్కివ్, ఒడెసా, ఖేర్సన్ తదితర నగరాల్లో రష్యా దాడులు ఒకస్థాయిలో జరిగాయి. సుమీ నగరంలో చమురు డిపోపైనా బాంబులు పడ్డాయి. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పలుచోట్ల ఉక్రెయిన్ పౌరులు ప్రదర్శనలు నిర్వహించారు. అణు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పుతిన్ ఇచ్చిన పిలుపు మేరకు భూమి, జల, ఆకాశ మార్గాల్లో అణ్వాయుధ బలగాలను అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు రష్యా వర్గాలు తెలిపాయి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి బాంబర్ల వద్ద అదనపు బలగాలు మోహరించినట్లు వెల్లడించాయి. అణ్వాయుధాలున్న యుద్ధవిమానాన్ని ఉక్రెయిన్ గగనతలానికి తీసుకువెళ్లారా అనే అనుమానాలు రేకెత్తించేలా రష్యా స్పందన ఉంది.
సడలిన కర్ఫ్యూ.. మార్కెట్లు కిటకిట
శనివారం నుంచి అమల్లో ఉన్న కర్ఫ్యూను సోమవారం సడలించడంతో నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రజలు సురక్షిత ప్రాంతాల నుంచి బయటకు వచ్చారు. ఆహారం, తాగునీరు వంటివి కొనడానికి వచ్చినవారితో సూపర్ మార్కెట్లు కిటకిటలాడాయి. వీటితో పాటు ఏటీఎంల వద్ద పెద్దఎత్తున బారులు తీరిన ప్రజలు కనిపించారు. బాంబుదాడులు తాత్కాలికంగా ఆగినట్లు కనిపించినా ఇది ఎంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. రష్యాకు సాయపడేందుకు బెలారస్ తన బలగాలను పంపించే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సురక్షిత మార్గంలో ప్రజలు కీవ్‌ను విడిచివెళ్లేందుకు అనుమతిస్తామని రష్యా సైనిక వర్గాలు చెప్పడంతో మున్ముందు ఏం జరగబోతోందో అనే ఆందోళన వివిధ వర్గాల్లో ఉంది.
ఉక్రెయిన్ గగనతలం పూర్తిగా మా నియంత్రణలో ఉంది: రష్యా