Russia attack Ukraine: ఉక్రెయిన్‌పై అత్యాధునిక క్షిపణులు, బాంబులతో రష్యన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఇరవై రోజులకుపైగా కొనసాగుతున్న దాడులతో ఉక్రెయిన్ శిథిలాల దిబ్బగా మారిపోయింది. అయితే, ఉక్రెయిన్ సేనలు దీటుగా ప్రతిఘటిస్తున్నాయి. రష్యాకు చెందిన ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లను కూల్చుతున్నట్లు పలు సందర్భాల్లో తెలిపాయి. సైనిక చర్య ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు 14,400 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. దీంతోపాటు 466 ట్యాంకులు, 1470 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 95 విమానాలు, 115 హెలికాప్టర్లు, 17 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా మూడు నౌకలు, 44 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది.
కొనసాగుతున్న పోరు..
ఉక్రెయిన్ బలగాలు రష్యా దళాలతో పోరాడుతోన్న ఫ్రంట్‌లైన్ ప్రాంతాల్లో గత 24 గంటల వ్యవధిలో పెద్ద ఘటనలేవీ నమోదు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ చెప్పారు. మేరియుపోల్, మైకోలైవ్, ఖేర్సన్, ఇజియంలలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, ఇక్కడ రష్యా దళాలు పెద్దఎత్తున దాడి చేస్తున్నాయని చెప్పారు.
జపోరిజియాలో 38 గంటల కర్ఫ్యూ విధింపు
ఉక్రెయిన్‌పై రష్యా దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిజియా నగర శివార్లలో జరిగిన దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు స్థానిక ఉప మేయర్ అనటోలీ కుర్తీవ్ తెలిపారు. మరో 17 మంది గాయపడ్డారని వెల్లడించారు. మరోవైపు ఈ నగరంలో 38 గంటల కర్ఫ్యూను ప్రకటించారు. ఇటీవల ఈ నగరంలోని ఓ అణు విద్యుత్ కేంద్రంపై దాడి.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసిన విషయం తెలిసిందే.
ఉక్రెయిన్‌లో నేడు 10 మానవతా కారిడార్లు
ఉక్రెయిన్‌లోని యుద్ధ సంక్షోభిత ప్రాంతాల నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే శనివారం మేరియుపోల్, ఖర్కివ్ సహా ఆయా నగరాలల్లో మొత్తం 10 మానవతా కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు ఉక్రెయిన్ ఉప ప్రధాని వెరెష్చుక్ తెలిపారు.
స్టీల్ దిగ్గజం 'అజోవ్‌స్టాల్' రష్యా హస్తగతం?
మేరియుపోల్‌ను చుట్టుముట్టిన రష్యా బలగాలు.. నగరంలోనూ దాడులు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే ఐరోపాలోనే అతిపెద్ద మెటలర్జికల్ కర్మాగారాల్లో ఒకటైన అజోవ్‌స్టాల్ స్టీల్ ప్లాంట్‌పై పట్టు కోసం రష్యా, ఉక్రెయిన్ బలగాల మధ్య పోరు సాగుతోందని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అయిన వాదిమ్ దెనిసెంకో శనివారం తెలిపారు. 'ఇప్పుడు అజోవ్‌స్టాల్ కోసం పోరాటం సాగుతోంది. అయితే.. ఈ ఆర్థిక దిగ్గజాన్ని కోల్పోయామని చెప్పగలను. ఐరోపాలోని అతిపెద్ద మెటలర్జికల్ ప్లాంట్లలో ఒకటైన దీన్ని.. ధ్వంసం చేస్తున్నారు' అని వాపోయారు.
ఉక్రెయిన్‌కు ఫైటర్లు.. ఖండించిన హిజ్బుల్లా
ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో రష్యా బలగాలకు మద్దతుగా తమ ఫైటర్లను పంపుతున్నామన్న ఆరోపణలను లెబనాన్ మిలీషియా గ్రూప్ హిజ్బుల్లా ఖండించింది. హిజ్బుల్లా సెక్రెటరీ జనరల్ హసన్ నస్రల్లా మాట్లాడుతూ.. ఈ వాదనలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇందులో నిజం లేదన్నారు. హిజ్బుల్లా నుంచి ఒక ఫైటర్ కాని, నిపుణుడు కాని ఉక్రెయిన్‌కు వెళ్లలేదన్నారు. తమ దేశంలో పోరాడటానికి రష్యా.. సిరియా, హిజ్బుల్లా నుంచి సుమారు 1,000 మంది ఫైటర్లను నియమించుకున్నట్లు ఇటీవల ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే.