తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాపై వంద రెట్లు పనిచేసే ఔషధం!

కొవిడ్​ మహమ్మారిపై పోరులో అత్యంత ప్రభావవంతమైన యాంటీవైరల్​ డ్రగ్​ అతి త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చికిత్సలో ఉపయోగిస్తున్న ఔషధాల కంటే ఇది ఎన్నో రెట్లు సమర్థంగా పనిచేస్తుందని బ్రిటన్​ పరిశోధకులు గుర్తించారు. ఈ మందు కరోనా వైరస్​పై చక్కగా పనిచేస్తున్నట్లు వివరించారు.

By

Published : Feb 4, 2021, 5:35 AM IST

ప్రస్తుతం కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న ఔషధాల కంటే ఎన్నో వందల రెట్లు ప్రభావవంతమైన యాంటీవైరల్‌ ఔషధం త్వరలోనే అందుబాటులోకి రానుంది. కరోనా కారక వైరస్‌పై ప్రభావవంతంగా పనిచేయగల మందును బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. భవిష్యత్తులో కరోనా వంటి మరిన్ని వైరస్‌ కారక మహమ్మారులు తలెత్తినా.. ఇది సమర్థవంతంగా నివారించగలదని వారు అంటున్నారు. వైరసెస్‌ అనే జర్నల్‌లో సంబంధిత పరిశోధనాంశాలు ప్రచురించారు.

త్వరలోనే అందుబాటులోకి

బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరోనా ఔషధాలపై ప్రయోగాలు జరుపుతున్నారు. వీటిలో భాగంగా థాప్సిగార్గిన్‌ అనే యాంటీ వైరస్‌ ఔషధాన్ని నియమిత మోతాదులో ఇచ్చినప్పుడు.. అది కొవిడ్‌ వైరస్‌పై చక్కగా పనిచేస్తున్నట్టు కనుగొన్నారు. ఇది వృక్ష సంబంధ పదార్ధాల నుంచి తయారుచేసినట్టు వారు వివరించారు. కొవిడ్‌-19 మాత్రమే కాకుండా శ్వాసక్రియ ద్వారా వ్యాప్తించే మరో రెండు వైరస్‌ వ్యాధులపై ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని వారు అంటున్నారు. కరోనా వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్ల కట్టడికి, ఈ ఔషధాన్ని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వారు కృషి చేస్తున్నారు.

ఎలా పనిచేస్తుందంటే..

ఒకేసారి వివిధ వైరస్‌లు దాడి చేయటంతో తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. అప్పుడు వాటిని వేర్వేరుగా గుర్తించటం సాధ్యంకాదు. ఇటువంటి సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ వైరస్‌లపై పనిచేసే థాప్సిగార్గిన్‌ వంటి విస్తృత శ్రేణి ఔషధాలు చికిత్సకు ఉపకరిస్తాయని వైద్యనిపుణులు వివరించారు. వ్యాధి సోకక ముందు, సోకినపుడు కూడా దీనిని వాడవచ్చని వారు వెల్లడించారు. వ్యాధికారక వైరస్‌లు మానవ శరీరంలో మరింత అభివృద్ధి చెందకుండా.. కనీసం 48 గంటలపాటు థాప్సిగార్గిన్‌ రక్షణ కల్పిస్తుందట. దీనిని నోటి ద్వారా తీసుకోగల వీలుండటంతో.. ఇంజెక్షన్లు, ఆస్పత్రిలో చేరే అవసరం ఉండదని పరిశోధకులు వివరించారు.

ప్రస్తుతం ఈ ఔషధ ప్రయోగాలు తొలి దశలోనే ఉన్నామని.. ఐతే ఈ పరిశోధన ఫలితాలు అతి ముఖ్యమైనవని పరిశోధనా బృందానికి చెందిన ప్రొఫెసర్‌ కిన్‌ చౌ చాంగ్‌ తెలిపారు. భవిష్యత్తులో రానున్న మహమ్మారులు కూడా జంతువుల్లోనే తలెత్తుతాయని ఆయన తెలియచేశారు. వైరస్‌ వ్యాధులు జంతువులు, మనుషుల మధ్య పరస్పరం వ్యాప్తి చెందే నేపథ్యంలో.. వాటి నివారణ, చికిత్సలో కూడా థాప్సిగార్గిన్‌ వంటి కొత్త తరం యాంటీవైరల్‌ ఔషధాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

ఇదీ చూడండి: టీకా కేంద్రంగా రేస్​ట్రాక్​- రోజుకు 10వేల మందికి వ్యాక్సిన్!

ABOUT THE AUTHOR

...view details