Party Gate Row: కొవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రధాని నివాసం ఉన్న డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన విందు వినోదాలకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ప్రశ్నావళి పంపారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం శనివారం ధ్రువీకరించింది.
కొవిడ్ సమయంలో తన ప్రభుత్వం విధించిన ఆంక్షలను ప్రధాని స్వయంగా ఉల్లంఘించినట్లు తేలితే బోరిస్ జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే జరిగితే.. 'పార్టీ గేట్' వ్యవహారంగా ప్రాచుర్యం పొందిన ఈ కేసులో ప్రధానిని దోషిగా పేర్కొంటూ, పదవి నుంచి ఆయన తప్పుకోవాలని ఇంతకాలం డిమాండ్ చేస్తూ వచ్చిన ప్రత్యర్థులు స్వరం మరింత పెంచుతారు. సొంత పార్టీలోనూ బోరిస్ జాన్సన్‌పై ఇదేవిధమైన ఒత్తిడి ఉంది. పలువురు మాజీ నేతలు ఆయనపై విమర్శలు ఎక్కపెడుతున్నారు. కన్జర్వేటివ్ పార్టీ మాజీ నేత ఐయాన్ డంకన్ స్మిత్ మాట్లాడుతూ.. బోరిస్ జాన్సన్ నింబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసు విచారణలో తేలితే ఆయన పదవిలో కొనసాగడం కష్టమే అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం నిజాలు దాచి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రిటన్ ప్రతిష్టను ముక్కలు చేస్తోందని మాజీ ప్రధాని జాన్ మేజర్ మండిపడ్డారు.