కరోనా వైరస్ పుట్టుకపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు రేకెత్తుతున్న వేళ చైనాలోని వూహాన్ ప్రయోగశాలలోనే ఇది తయారైనట్లు ప్రఖ్యాత శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత లూక్ మోంటాగ్నియర్ సంచలన ఆరోపణలు చేశారు.
ఎయిడ్స్ వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన మోంటాగ్నియర్ కరోనావైరస్ అడవి జంతువుల నుంచి వూహాన్ మార్కెట్‌కు వెళ్లిందనే వార్తను తాను నమ్మట్లేదన్నారు. వుహాన్ ల్యాబ్‌లో ఎయిడ్స్ వైరస్‌కి వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పుడు చోటు చేసుకున్న ప్రమాదంలో ఈ కొత్త వైరస్ పుట్టిందని చెప్పారు. కరోనా వైరస్ జన్యురాశిలో హెచ్‌ఐవీ మూలకాలు, మలేరియా క్రిమి ఉండటం అనుమానించదగిన అంశమని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ లక్షణాలు సహజ సిద్ధంగా ఉద్భవించినవి కావని తెలిపారు. కొన్నేళ్లుగా కరోనా వైరస్‌లపై ప్రయోగాలు చేస్తున్న వూహాన్ పరిశోధనశాలలో ప్రమాదం సంభవించి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రంప్ అనుమానాలకు ఊతం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా వైరస్ చైనాలోని ల్యాబ్ నుంచే వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రొఫెసర్ లూక్ మోంటాగ్నియర్ ఆరోపణలతో ట్రంప్ అనుమానాలకు మరింత ఊతమందినట్లయింది.