New zealand PM Marriage: న్యూజిలాండ్‌లో తాజాగా ఒమిక్రాన్ కలకలం రేగింది. దీంతో ఈ కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తిని అరికట్టేందుకు ఇక్కడి ప్రభుత్వం మరోసారి కొవిడ్ ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ నిబంధనల నేపథ్యంలో తన వివాహ వేడుకను కూడా రద్దు చేసుకున్నట్లు దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఇప్పట్లో తన పెళ్లి వేడుక జరగదంటూ ఆదివారం విలేకరులతో చెప్పారు. మహమ్మారి కారణంగా ఇటువంటి అనుభవాలు ఎదుర్కొన్న అనేకమంది న్యూజిలాండ్‌వాసుల జాబితాలో తానూ చేరానని చెప్పుకొచ్చారు.
న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ పెళ్లి వాయిదాపై ఎలా భావిస్తున్నట్లు విలేకరులు ప్రశ్నించగా.. 'జీవితం అంటే అలానే ఉంటుంది' అంటూ బదులిచ్చారు. ఆర్డెర్న్, ఆమె భాగస్వామి క్లార్క్ గేఫోర్డ్ ఇప్పటివరకు తమ వివాహ తేదీని ప్రకటించలేదు. కానీ, త్వరలోనే ఈ వేడుక కోసం ఏర్పాట్లు చేసినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి.
New Omicron Restrictions: 'కొవిడ్ నేపథ్యంలో గడ్డు పరిస్థితులు అనుభవించిన వేలాది మంది న్యూజిలాండ్ వాసులకు నేనేమీ భిన్నం కాదు. కానీ, బాధాకరమైన విషయం ఏంటంటే.. మనకు ఇష్టమైనవారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారిపక్కన ఉండలేకపోవడమే. ఇది చాలా బాధను కలిగిస్తుంది' అని జసిండా తెలిపారు. న్యూజిలాండ్‌లో ఇటీవల ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న ఓ కుటుంబంలో తొమ్మిది మందికి ఒమిక్రాన్ సోకింది. వారు ప్రయాణించిన విమానంలో ఫ్లైట్ అటెండెంట్‌కూ పాజిటివ్‌గా తేలడంతో.. అధికారులు స్థానికంగా మరోసారి ఆంక్షలు కఠినతరం చేశారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి వీటిని అమల్లోకి తెచ్చారు. ఈ క్రమంలో బార్లు, రెస్ట్రాంట్‌లతోపాటు వివాహ వేడుకల వద్ద జనసంఖ్యపై పరిమితులు విధించారు. దీంతోపాటు మాస్కులను తప్పనిసరి చేశారు. వచ్చే నెలాఖరు వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అధికారం కోసం ట్రంప్ అంతకు తెగించారా?.. వెలుగులోకి ఆసక్తికర ఆధారం!