తెలంగాణ

telangana

ETV Bharat / international

తిరగేసిన కార్లతో తిరుగులేని సందేశం - georgia

జార్జియా రాజధాని టెబిలిసిలో అక్కడక్కడ తిరగేసిన కార్లే కనిపిస్తాయి. వాటిని అలా ఉంచింది అలంకరణ కోసం కాదు.... రహదారి భద్రతపై అవగాహన కల్పన కోసం.

తిరగేసిన కార్లతో తిరుగులేని సందేశం

By

Published : May 12, 2019, 9:22 PM IST

తిరగేసిన కార్లతో తిరుగులేని సందేశం

జార్జియాలో రోడ్డు భద్రత ప్రధాన సమస్య. అధికారిక లెక్కల ప్రకారం గత పదేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 6వేల 608. క్షతగాత్రుల సంఖ్య దాదాపు 85వేలు. అందుకే... రహదారి ప్రమాదాల నివారణ కోసం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది అక్కడి ప్రభుత్వం.

జార్జియా రాజధాని టెబిలిసిలో... తిరగేసిన కార్లను రోడ్డు పక్కన ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్నవే. ఇలా చేయడం ద్వారా రహదారి భద్రత విషయంలో డ్రైవర్లను అప్రమత్తం చేయవచ్చన్నది అధికారుల ఆలోచన.

"2018 లెక్కలు చూస్తే 459 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. మరణాలకు ప్రధాన కారణం అధిక వేగం, మధ్య గీతను అతిక్రమించటం, రోడ్లపై విన్యాసాలు చేస్తూ నిబంధనలు అతిక్రమించటం, మద్యం సేవించి వాహనాలు నడపడం. వీటన్నింటికీ, వాహన చోదకుల నిర్లక్ష్య ధోరణికి సంబంధం ఉంది. ఈ నిర్లక్ష్యం వల్ల వారు గాయపడడమే కాక, ఇతరుల ప్రాణాలు పోయే ప్రమాదముందని మేము చెప్పదలిచాం. జీవితాలు తారుమారు చేసుకోవద్దని ఈ తిరగేసిన కార్ల ద్వారా సందేశం ఇవ్వదలిచాం."

-బేకా లిల్వాష్​విలి, జార్జియా హోంశాఖ అధికారి

జార్జియా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రచారంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు విమర్శలు చేస్తున్నారు.

"ఇది సరికాదు. ఎందుకంటే ఇది వ్యక్తి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిజమే... ఎవరైనా సరే మద్యం మత్తులో వాహనం నడపకూడదు. కారు బోల్తా కొట్టించి వేరే వారిని గాయపరచకూడదు. నిబంధనలు అతిక్రమించకూడదు. వాహనంతో ఢీకొట్టి ఎవర్నీ చంపకూడదు. అయినా సరే... ఇలా ప్రచారం చేయటం మాత్రం సరికాదు."

-గురమ్ ఖపావా, వాహన చోదకుడు

మరికొంత మంది ఈ ప్రచారాన్ని స్వాగతిస్తున్నారు. ఇది ప్రమాదాలకు కారణమయ్యేలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి హెచ్చరికలా పనిచేస్తుందని అభిప్రాయపడుతున్నారు.

తిరగేసిన కార్లతో అనుకున్న లక్ష్యాన్ని సాధించామని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: జైలులో 'అమ్మ'ల ఫ్యాషన్​ షో అదుర్స్​

ABOUT THE AUTHOR

...view details