ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా పంజా: ఐరోపాలో 90 వేలు దాటిన మరణాలు - death toll

కరోనా వైరస్​ ఐరోపా దేశాల్లో విలయతాండవం చేస్తోంది. ఈ ప్రాంతంలో మొత్తం మరణాల సంఖ్య 90 వేలు దాటింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరణాల సంఖ్యలో 65 శాంత కన్నా ఎక్కువ. బ్రిటన్​లో లాక్​డౌన్​ మరో 3 వారాలు పొడిగించాలని బోరిస్​ ప్రభుత్వం యోచిస్తోంది. అమెరికా న్యూయార్క్​లో మాస్కులు తప్పనిసరి చేస్తూ గవర్నర్​ ఆదేశాలు జారీ చేశారు.

Europe
ఐరోపాలో 90వేలు దాటిన కరోనా మరణాలు
author img

By

Published : Apr 16, 2020, 7:30 PM IST

Updated : Apr 16, 2020, 7:55 PM IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లో మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కేసుల సంఖ్యలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా తర్వాత స్పెయిన్​ ఉంది. స్పెయిన్​లో గత 24 గంటల్లో మరో 551 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 19,130కి చేరింది. ఐదు వారాలుగా లాక్​డౌన్​ పాటిస్తున్న కారణంగా మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. కొత్తగా 5,183 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1,82,816కి చేరింది.

in article image
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు

ఐరోపాలో 90వేలు దాటిన మరణాలు..

స్పెయిన్​, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్​ సహా ఐరోపాలోని ఇతర దేశాల్లో మరణాలు, కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న కారణంగా.. ఈ ప్రాంతంలో మరణాల సంఖ్య 90వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా మరణాల్లో (137,488) ఇది 65 శాతం కన్నా ఎక్కువగా ఉండటం గమనార్హం. ఐరోపావ్యాప్తంగా మొత్తం 90,180 మంది కరోనాతో మరణించారు. 1,047,279 మంది వైరస్​ బారిన పడ్డారు.

న్యూయార్క్​లో మాస్కులు తప్పనిసరి..

కేసులు, మరణాల సంఖ్యలో అగ్రస్థానంలో ఉంది అమెరికా. అందులో న్యూయార్క్​లోనే అధికంగా ఈ వైరస్​ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు ఆ రాష్ట్ర గవర్నర్​ ఆండ్రూ క్యూమో. ఈ ఆదేశాలు ఏప్రిల్​ 17 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. న్యూయార్క్​లో కొత్తగా 11,571 మందికి కరోనా సోకింది. రాష్ట్రవ్యాప్తంగా 2,13,779 కేసులు నమోదయ్యాయి.

బ్రిటన్​లో మరో 3 వారాలు లాక్​డౌన్​!

కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఈ మహమ్మారిని అరికట్టేందుకు గత మూడు వారాలుగా అమల్లో ఉన్న కఠిన ఆంక్షలను మరికొన్ని రోజులు పొడిగించాలని యోచిస్తోంది యూకే ప్రభుత్వం. కరోనా నుంచి ఇటీవలే కోలుకున్న ప్రధాని బోరిస్​ జాన్సన్​ గురువారం కేబినెట్​ సమావేశం నిర్వహించి.. లాక్​డౌన్​పై తుది ప్రణాళికను నిర్ణయిస్తారని బ్రిటన్​ విదేశాంగశాఖ మంత్రి వెల్లడించారు. లాక్​డౌన్​ మరో మూడు వారాలు పొడిగించే అవకాశం ఉందని తెలిపారు.

ఆఫ్రికాలో 10 లక్షల మందికి పరీక్షలు!

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో కేసుల సమచారంలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు సిద్ధమైంది ఆఫ్రికా. వచ్చే వారం నుంచి 10 లక్షలకుపైగా కరోనా పరీక్షలు చేయనున్నట్లు ఆఫ్రికా వ్యాధుల నియంత్రణ, నిర్మూల కేంద్రం అధినేత జాన్​ కెంగెసాంగ్​ తెలిపారు. వచ్చే మూడు నెలల్లో 15 మిలియన్ల మందికి పరీక్షలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆఫ్రికావ్యాప్తంగా ఇప్పటివరకు కేసుల సంఖ్య 17వేలు దాటింది. ప్రపంచదేశాలతో పోలిస్తే.. పరీక్ష కిట్లు, వైద్య పరికరాలు సమకూర్చుకోవటంలో ఆఫ్రికా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఆరోగ్య సలహాదారుపై పాక్​ ప్రధాని ఆగ్రహం..

పాకిస్థాన్​లో కరోనా కేసుల సంఖ్య 6,500 దాటింది. ఈ నేపథ్యంలో పాక్​ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది ఆ దేశ సుప్రీం కోర్టు. ప్రధానికి ప్రత్యేక ఆరోగ్య సలహాదారుగా ఉన్న డా. జాఫర్​ మిర్జాను విధుల్లోనుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా నిర్లక్ష్యపు వైఖరి.. ప్రభుత్వ చర్యలను సుప్రీంకు వివరించటంలో విఫలమైనందుకు ఆరోగ్య సలహాదారు జాఫర్​ను మందలించారు ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​. గురవారం జరిగిన కేబినెట్​ భేటీలో ఆసహనం వ్యక్తం చేశారు. పాక్​లో గడిచిన 24 గంటల్లో 520 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 124 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: కరోనా మరణాల్లో అమెరికా కొత్త రికార్డ్

Last Updated : Apr 16, 2020, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details