దశాబ్దాలుగా యుద్ధంతో అతలాకుతలమైన అఫ్గానిస్థాన్‌లో సుస్థిర శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో అమెరికా, తాలిబన్‌లు చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. దోహాలో నేడు జరిగే ఈ కార్యక్రమానికి తాలిబన్ ప్రతినిధి బృందం, అమెరికా శాంతి చర్చల ప్రతినిధి జాల్మే ఖలీజాద్, ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, పాక్ విదేశాంగ మంత్రి ఎస్.ఎం.ఖురేషీ, ఉజ్బెక్ విదేశాంగ మంత్రి కామిలోవ్ సహా ఈ ప్రాంతంలోని పలు దేశాల నేతలు, దూతలు హాజరవుతారు. ఖతార్‌లో భారత రాయబారి పి.కుమరన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ అంశంపై అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా శుక్రవారం కాబూల్ వెళ్లారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాసిన లేఖను అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి అందజేశారు.
తాలిబన్లతో కలిసి ఒక అధికారిక కార్యక్రమంలో భారత అధికారిక ప్రతినిధి పాల్గొనబోవడం ఇదే మొదటిసారి. భవిష్యత్‌లో అమెరికా బలగాలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించడానికి ప్రతిపాదిత ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో భారత్‌కున్న ఆందోళనలపై అమెరికాలో భారత మాజీ రాయబారి మీరా శంకర్‌తో ‘ఈటీవీ భారత్’ ముచ్చటించింది.
భారత్‌కున్న ఆందోళనలేమిటి..?
అఫ్గాన్‌లో అమెరికా, నాటో బలగాలను ఆకస్మికంగా ఉపసంహరిస్తే అరాచకం నెలకొనే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఉత్పన్నమయ్యే శూన్యతను ఉగ్రవాద ముఠాలు ఆక్రమించుకోవచ్చు. దీనివల్ల ప్రాంతీయ శక్తులపైన, అంతర్జాతీయ భద్రతపైన ప్రతికూల ప్రభావం పడొచ్చని భారత ఆందోళన చెందుతోంది. అందుకే సంధి కాలంలో అఫ్గాన్ ప్రభుత్వానికి.. ముఖ్యంగా వారి సైన్యం, పోలీసులకు అంతర్జాతీయ సాయం అందాలి. విదేశీ నిధులు ఆకస్మికంగా ఆగిపోతే అఫ్గాన్ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇక రెండో విషయం ఏమిటంటే.. తాలిబన్లను ప్రధాన స్రవంతిలోకి తెచ్చే క్రమంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ; మహిళలు, మైనార్టీల హక్కుల సాధన విషయంలో సాధించిన విజయాలకు విఘాతం కలగకుండా కాపాడుకోవాలి. ఇక చివరిగా.. అఫ్గానిస్థాన్‌లో ఒప్పందం విషయంలో అమెరికాకు పాక్ దగ్గర కావొచ్చన్న ఆందోళనలు ఉన్నాయి. అమెరికాకు సాయపడుతున్నాం కాబట్టి భారత్‌తో ఉన్న సరిహద్దుల విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్న సంకేతాలు పొరపాటున కూడా పాక్‌కు అందకూడదు.
మరి పరిష్కారమేమిటి?
అంతర్జాతీయ వ్యవస్థ ద్వారా పాక్‌పై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికాకు కొన్ని సాధనాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్)లో పాక్‌పై ఒత్తిడి పెట్టడం లేదా ఐఎంఎఫ్‌లో సంప్రదింపులు వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు. ద్వైపాక్షికంగా మాత్రం మెతక వైఖరిని అవలంబించొచ్చు.
రష్యా, ఇరాన్‌ల పాత్రేంటీ..?
తాలిబన్లపై గతంలో శత్రుభావం ఉన్నప్పటికీ.. అమెరికాకు వ్యతిరేకంగా పరపతి పెంచుకు నేందుకు తాలిబన్లతో ఇరాన్ సంబంధాలు కొనసాగిస్తోంది. ఆ ప్రాంతంలో అమెరికా ఉనికిపై ఇరాన్‌కున్న ఆందోళనలే ఇందుకు కారణం. అఫ్గాన్‌లో అస్థిరత వల్ల మధ్య ఆసియాతోపాటు తమ దేశంపైన పడే ప్రభావం గురించి రష్యా ఆందోళన చెందుతోంది. ఈ ప్రాంతం నుంచే రష్యాకు మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా అవుతున్నాయి. అందువల్ల ఇక్కడి పరిస్థితులపై రష్యా కన్నేసి ఉంచుతుంది. తాలిబన్‌తో చర్చల్లో గతంలో మధ్యవర్తితత్వ పాత్ర పోషించింది. దాన్ని కొనసాగిస్తుంది. అమెరికా, రష్యా సహా అఫ్గాన్ అంశంతో ముడిపడిన అందరితోనూ భారత్ టచ్‌లో ఉంటుంది.
అఫ్గానిస్థాన్‌లో పాత్ర పోషించే విషయంలో భారత్ వెనకడుగు వేయడాన్ని మనం గతంలో చూశాం. అయితే అక్కడ మౌలిక వసతులను భారత్ అభివృద్ధి చేసిన నేపథ్యంలో తన పాత్రను పెంచుకోవాల్సిన అవసరం లేదా? అఫ్గాన్‌కు తన బలగాలను పంపకూడదని చెబుతున్న మన దేశం అక్కడ పెట్టుబడులను పెంచి ఎలా వ్యూహాత్మక భద్రతను పరిరక్షించుకోగలదు?
అఫ్గాన్‌లోకి సైన్యాన్ని భారత్ పంపబోదని నేను అనుకుంటున్నా. ఒకవేళ పంపిస్తే పరిస్థితి చేజారిపోతుంది. అనేక విపరిణామాలు ఎదురవుతాయి. అఫ్గాన్ అంతర్గత సమస్య కాస్తా.. భారత్-పాక్ వివాదంగా మారుతుంది. అయితే అఫ్గాన్ భద్రతా దళాలను బలోపేతం చేసే దిశగా మనం సాయం పెంచాలి. ఆయుధాలు, ఇతర సాధన సంపత్తి, శిక్షణ అందించొచ్చు. అఫ్గాన్ దళాలకు గతంలో మనం కొన్ని హెలికాప్టర్లు సరఫరా చేశాం. అయినా వీటి కొరత ఉంది. అక్కడ మనం చేపడుతున్న అనేక మౌలిక వసతుల ప్రాజెక్టుల వద్ద మన పారామిలటరీ దళాలతో భద్రత కల్పించుకుంటున్నాం. మరో విషయం.. అఫ్గాన్‌లోని అన్ని రాజకీయ పక్షాలకు మనం చేరువ కావాలి. తాలిబన్‌తో మాట్లాడేది లేదని ఇప్పుడు మనం చెప్పలేం. వారికి ఆ దేశంలో కచ్చితంగా పాత్ర ఉంది. అక్కడ తాలిబన్ జాతీయవాదం ఉందా.. లేక అఫ్గాన్ జాతీయవాదం ఉందా అన్నది చూడాలి. తాలిబన్లు కూడా పాక్‌పై పూర్తిగా ఆధారపడటానికి ఇష్టపడకపోవచ్చని అనుకుంటున్నా. అందువల్ల అమెరికా దళాల ఉపసంహరణ తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో విశ్లేషించుకొని, ఆ మేరకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి.
ఇదీ చూడండి:లాస్ ఏంజెలిస్‌లో 'భారతీయుడు-2' తరహా ఘటన