ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ఏమైంది? గత కొంత కాలంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్రశ్న ఇది. ఆయన ఆనారోగ్యంపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఉత్తర కొరియా మౌనం పాటించడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. తాజాగా వీటిపై అమెరికా స్పందించింది. కిమ్‌కు సంబంధించిన విషయాలపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదన్నారు అగ్రరాజ్య విదేశాంగమంత్రి మైక్ పాంపియో. అయితే ఆ దేశంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.
"మేం కిమ్‌ను చూడలేదు. ఇప్పటివరకు మా వద్ద ఎలాంటి నివేదికలు కూడా లేవు. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. కిమ్ చుట్టూ, ఉత్తర కొరియాలో ఏం జరుగుతోందనే అంశంపై నిఘా పెట్టాం. ఉత్తర కొరియాను అణునిరాయుధీకరణ చేయాలన్న లక్ష్యం వల్ల అన్నింటినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం."
-- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి.