అఫ్గానిస్థాన్‌లో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో అమెరికా వదిలేసిన ఆయుధాలను(america weapons in afghanistan) పాకిస్థాన్‌కు విక్రయిస్తున్నారన్న వార్తలను ఖండించారు తాలిబన్లు(Afghanistan Taliban). అందులో నిజం లేదని ఇస్లామిక్ ఎమిరేట్ ప్రతినిధి ఇనాముల్లా సమంఘాని తోసిపుచ్చినట్లు టోలో న్యూస్ తెలిపింది.
" ఆ వార్తలను ఇస్లామిక్ ఎమిరేట్ ఖండిస్తోంది. ఇప్పుడు అఫ్గానిస్థాన్‌లో స్వతంత్ర ప్రభుత్వం ఉంది. ప్రత్యేక రక్షణ విభాగాలను కలిగి ఉంది. ఆ భద్రతా విభాగాలకు మిలిటరీ సామగ్రి అవసరం ఉంటుంది."
- ఇనాముల్లా సమంఘాని, అఫ్గానిస్థాన్ ప్రతినిధి.
అఫ్గానిస్థాన్‌లో అమెరికా బలగాలు వదిలేసిన ఆయుధాలను(america weapons in afghanistan) కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, ఇప్పటికే చాలా వరకు చేజిక్కించుకుందని పలు నివేదికలు వెల్లడించాయి. ఆ ఆయుధాలను ఉగ్ర ముఠాలకు అందించే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఈ క్రమంలోనే స్పందించారు తాలిబన్లు(Taliban news).
ఈ ఏడాది ఆగస్టులో అఫ్గాన్ నుంచి ఆగమేఘాలపై బలగాలను వెనక్కి రప్పించింది అమెరికా. ఈ క్రమంలోనే సుమారు 85 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను(america weapons in afghanistan) వదిలేసినట్లు టోలో న్యూస్ పేర్కొంది.
అమెరికా ఆయుధాలను భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐ కనుసన్నల్లోని ఉగ్రవాద సంస్థలకు అప్పగించే ప్రమాదం ఉందని న్యూయార్క్ టైమ్స్ రెండు రోజుల క్రితం పేర్కొంది. అయితే.. తాలిబన్ల విజయంతో పాక్‌లోని ఉగ్రముఠాలు ధైర్యంగా తయారయ్యాయని, ఆ ఆయుధాలను ఆ దేశంలోనే తొలుత వినియోగిస్తారని భారత్ పేర్కొంది. ఎలాంటి ప్రమాదం ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:పాక్ చేతికి అఫ్గాన్‌లోని అమెరికా ఆయుధాలు- భారత్‌లో విధ్వంసానికేనా?