బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి తన గగనతలంపై పాకిస్థాన్ ఆంక్షలు విధించింది. ఈ ప్రభావంతో భారత్ నుంచి అమెరికా, ఐరోపా దేశాలకు రాకపోకలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానాలను రూటు మార్చారు. తాజాగా ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ పాక్ పౌర విమానయాన అథారిటీ అన్ని రకాల విమానాల రాకపోకలకు అనుమితిస్తూ నిర్ణయం తీసుకొంది.
ఇక పాక్ గగనతలం మీదుగా భారత్ విమానాలు
బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం తమ దేశ గగనతలం మీదుగా విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించిన పాకిస్తాన్ ఎట్టకేలకు వాటిని తొలగించింది. ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ మార్గాలలో అన్ని రకాల విమానాల రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ఈ మేరకు పాక్ పౌర విమానయాన అథారిటీ నోటీసులు జారీ చేసింది.
బాలాకోట్ దాడులు జరిగిన ఐదు నెలల అనంతరం పాక్ ఈ ఆంక్షలు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. పాక్ తన గగనతలంపై ఆంక్షలు విధించడం వలన రూ.491 కోట్ల మేర ఎయిర్ ఇండియా నష్ణపోయింది. స్పైస్‌జెట్, ఇండిగో, గోఎయిర్ సంస్థలు రూ. 30.73, 25.1, 2.1 కోట్లు నష్టపోయాయి.తాజా నిర్ణయం భారత విమానయాన సంస్థలకు కాస్త ఊరట కలిగించనుంది.
కొన్ని రోజుల ముందే భారత విమానాలపై ఉన్న నిషేధాన్ని ఈ నెల 26 వరకు పొడిగిస్తున్నట్టు పాక్ ప్రకటించింది. సరిహద్దు వెంబడి వైమానిక స్థావరాల్లో భారత వాయుసేన మోహరించిన యుద్ధ విమానాలను తొలగించే వరకు తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలను అనుమతించమని వెల్లడించింది. అయితే ఎట్టకేలకు నిషేధాన్ని ఎత్తివేసింది.
- ఇదీ చూడండి: ఉత్తరాదిన వరదల బీభత్సం.. 44 మంది మృతి