పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.ఐరోపా పర్యటనకు వెళతున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రయాణించే విమానానికి పాక్ గగనతలం మీదుగా వెళ్లేందుకు ఆ దేశం అనుమతి నిరాకరించింది.
రాష్ట్రపతి ఐరోపా పర్యటన నిమిత్తం పాక్ గగనతలం నుంచి వెళ్లడానికి ఆ దేశ అనుమతి కోరారు భారత అధికారులు. అయితే కోవింద్ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి ఎస్ఎం ఖురేషీ వెల్లడించారు. విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదించినట్లు తెలిపారు.
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దుతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఖురేషీ. కశ్మీర్‌పై భారత్ నిర్ణయం తీవ్రమైన సమస్యగా పేర్కొన్న ఆయన.. ఈ అంశాన్ని ఐరాస మానవ హక్కుల మండలి దృష్టికి తీసుకెళతామన్నారు.