ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో గతేడాది రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కర్బన ఉద్గారాల కారణంగా సముద్రాల్లో రోజురోజుకూ వేడి పెరిగిపోతోందన్నారు. ఫలితంగా వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు.
గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వల్ల వెలువడిన 90శాతం ఉష్ణాన్ని సముద్రాలు గ్రహిస్తాయి. గత కొద్ది సంవత్సరాల్లో ఈ వేడి తీవ్రత ఎలా ఉందనే వివరాల ద్వార భూతాపాన్ని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.
గడిచిన దశాబ్దాల్లో సముద్రంలో సుమారు 2వేల మీటర్ల లోతు వరకు నమోదైన వేడి తీవ్రతను గుర్తించాలని అంతర్జాతీయ నిపుణుల బృందం భావించింది. ఇందుకోసం చైనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్(ఐఏపీ) అందించిన నివేదికను పరిశీలించింది. ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో గతేడాది అత్యధికంగా 0.075 సెల్సియస్ నమోదైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫలితంగా సముద్ర మట్టాలు పెరుతున్నాయని, సముద్ర జీవులు మరణిస్తున్నట్లు తెలిపారు.