భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా నియమితులయ్యారు. దిల్లీలో జరిగిన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.
"భాజపా సభ్యత్వ నమోదు, సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యే వరకు జేపీ ఈ పదవిలో ఉంటారు. రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే కొనసాగుతారు. "
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నడ్డాను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పలువురు కేంద్రమంత్రులు, భాజపా నేతలు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు.
మంత్రిత్వ శాఖ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే నేపథ్యంలో అధ్యక్షుడి బాధ్యతలను ఎవరికైనా అప్పగించాలని అమిత్ షా భావిస్తున్నారని సమాచారం. అందుకు నడ్డా సరైన వ్యక్తిగా షా అభిప్రాయపడినట్టు పార్గీ వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది డిసెంబర్‌తో అమిత్‌షా అధ్యక్ష పదవీ కాలం ముగియనుంది. ఓ వ్యక్తికి ఒకే పదవి అన్న పార్టీ నిబంధన ప్రకారం షా డిసెంబర్లో పదవి నుంచి ఆయన వైదొలుగుతారని, నడ్డా అధ్యక్షుడి బాధ్యతలను స్వీకరిస్తారని సమాచారం.
కార్యకర్తలా పనిచేస్తా: నడ్డా
తనను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించటం పట్ల మోదీ, షాకు కృతజ్ఞతలు తెలిపారు నడ్డా. కార్యకర్తల సహకారంతో పార్టీని మరింత ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేస్తామన్నారు. సాధారణ కార్యకర్తలా పని చేస్తానని, పార్టీనే తన మతమని ఉద్ఘాటించారు.
జులై 6 నుంచి సభ్యత్వ నమోదు
పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా జులై 6 నుంచి భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కొన్ని నెలల పాటు సాగనుంది. ఈ క్రమంలో అమిత్ షా, నడ్డా ఆధ్వర్యంలోనే హరియాణా, ఝార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఇదీ ప్రస్థానం
హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన నడ్డా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రం నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బాధ్యతలను నిర్వహించారు. ఆయన సారథ్యంలో 80 స్థానాలకు గాను 62 కైవసం చేసుకుంది భాజపా.
ఇదే తొలిసారి..
భాజపాకు కార్యనిర్వాహక అధ్యక్షుడిని నియమించడం ఇదే తొలిసారి. భాజపా రాజ్యాంగం ప్రకారం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముందు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కనీసం 50 శాతం పోస్టులకు సంస్థాగత ఎన్నికలు పూర్తవ్వాలి. అయితే, ఇలా ఎన్నికలు పూర్తవ్వకపోయినా పార్టీ అధ్యక్షుడిని నియమించేందుకు అవకాశం ఉంది.
ఇదీ చూడండి : 'ఈవీఎంలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి'