దక్షిణ కొరియాతో(South Korea news ) చర్చల పునరుద్ధరణకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఉత్తర కొరియా(North Korea news) అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ (Kim yo jong news). అయితే.. శత్రు విధానాలు, ద్వంద్వ వైఖరితో ఉత్తర కొరియాను రెచ్చగొట్టే పనులకు దూరంగా ఉంటేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఆరు నెలల తర్వాత ఉత్తర కొరియా తొలిసారి క్షిపణి పరీక్షలు చేపట్టిన మరుసటి రోజునే జోంగ్ (Kim jong un sister) ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల జరిగిన ఐరాస సాధారణ సమావేశంలో(UN general assembly 2021) దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్.. 1950-53 నాటి యుద్ధం ముగింపు ప్రకటన కోసం తమ ప్రయత్నాన్ని పునరుద్ఘాటించారు. దాని ద్వారా అణ్వాయుధ నిర్మూలన, కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు దారి తీస్తుందన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఈ మేరకు స్పందించారు కిమ్ సోదరి.
" గతంలో మాదిరిగా మమ్మల్ని రెచ్చగట్టటం, ద్వంద్వ వైఖరితో విమర్శలు చేయటానికి దూరంగా ఉంటూ, వారి మాటలు, చేతల్లో నిజాయతీని చూపిస్తూ, వైరాన్ని విడనాడితే.. సంబంధాల పునరుద్ధరణకు చర్చలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. యుద్ధ ముగింపు ప్రకటన చేయాలంటే.. పరస్పర ప్రయోజనాలను గౌరవించాలి, పక్షపాతం, శత్రు విధానాలు, ద్వంద్వ వైఖరిని విడనాడితేనా అది సాధ్యమవుతుంది."
- కిమ్ యో జోంగ్, కిమ్ సోదరి.
అయితే.. ఉత్తర కొరియా సీనియర్ దౌత్యవేత్త, విదేశాంగ శాఖ సహాయమంత్రి రి థే సాంగ్ ప్రకటనకు విరుద్ధంగా ఉన్నాయి కిమ్ సోదరి తాజా వ్యాఖ్యలు. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు 1950-53 నాటి యుద్ధానికి ముగింపు పలికేందుకు దక్షిణ కొరియా ఇచ్చిన పిలుపును తిరస్కరించారు సాంగ్.