కశ్మీర్లో 370 అధికరణ రద్దు అనంతరం భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ విషయంపై తొలిసారి అగ్రదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు కీలక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా కశ్మీర్ పరిణామం అనంతరం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు, అనుసరిస్తోన్న విధానాలపై ప్రధాని మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
సుమారు 30 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ సంభాషణపై ప్రధాని కార్యాలయం వరుస ట్వీట్లు చేసింది.
"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సంభాషణ స్నేహపూర్వకంగా సాగింది. సరిహద్దుల్లో ఉగ్రవాద నియంత్రణ, హింసా, తీవ్రవాదం లేని వాతావరణం ఏర్పాటు ఆవశ్యకతను ప్రధాని మోదీ ముఖ్యంగా ప్రస్తావించారు. పేదరికం, నిరక్షరాస్యతపై పోరాడేందుకు కలిసి వచ్చే ఎవరితోనైనా నిబద్ధతతో సహకరిస్తామని మోదీ తెలిపారు." - ప్రధాని కార్యాలయం ట్వీట్.