వుహాన్... కరోనా వైరస్ కేంద్రబిందువైన చైనాలోని ఓ నగరం. చివరి వైరస్ బాధితుడు ఆదివారం డిశ్చార్జ్ అవడం వల్ల వుహాన్ సంబరాలు జరుపుకుంటోంది. కానీ అక్కడ ఉంటున్న భారతీయుల్లో మాత్రం ఇంకా భయాందోళనలు పోలేదు. వైరస్ 2.0 విజృంభించే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం అక్కడ పెరుగుతున్న ఎసింప్టోమాటిక్(లక్షణాలు కనబడని) కేసులు.
లాక్డౌన్ ఎత్తివేసినా...
వైరస్ వల్ల వుహాన్లో 50వేల 333 కేసులు, 3వేల 869 మరణాలు నమోదయ్యాయి. 11 మిలియన్ జనాభా గల నగరం.. 76 రోజుల లాక్డౌన్ అనంతరం ఈ నెల 8న విముక్తి పొందింది. అయితే వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 600మంది భారతీయ విద్యార్థులు, నిపుణులను ఫిబ్రవరిలో ప్రభుత్వం వెనక్కి రప్పించింది. కానీ కొందరు వృత్తి, వ్యక్తిగత కారణాలతో అక్కడే ఉండేందుకు ధైర్యం చేశారు.
వుహాన్లో గత కొద్ది రోజులుగా ఎలాంటి కొత్త కేసులు, మరణాలు నమోదవడం లేదని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. అయితే చైనా వ్యాప్తంగా సోమవారం మాత్రం.. ఎలాంటి లక్షణాలు బయటపడని 40 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ తరహా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 997కు చేరింది. ఇందులో 130మంది విదేశీయులున్నారు.