భారత్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్. భారత్ ఏదైనా చర్యకు పాల్పడితే పాక్ సైన్యం తీవ్రంగా స్పందిస్తుందని ప్రగల్భాలు పలికారు.
"నరేంద్రమోదీ, భారత ఆర్మీ చీఫ్... మీ ఇద్దరికీ ఓ సందేశం ఇస్తున్నా. ఇప్పటికే మీరు ఆగస్టు 5న(ఆర్టికల్-370 రద్దును ప్రస్తావిస్తూ) పొరపాటు చేశారు. హిందూ ఓటర్ల సంఖ్యను పెంచుకోవడానికి మీరు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చనే తప్పుడు అభిప్రాయంలో ఉంటే... అదే మీ చివరి పొరపాటు అవుతుంది. 20 కోట్ల మంది పాకిస్థాన్ ప్రజలు, యుద్ధానుభవం ఉన్న మా సైన్యం భారత్‌కు గట్టి గుణపాఠం చెబుతుంది."-ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధానమంత్రి
కశ్మీర్ సమస్యను పూర్తిగా అంతం చేస్తానని మోదీ భావించారని.. కానీ అది ఇప్పుడు అంతర్జాతీయ అంశంగా మారిందని తెలిపారు ఇమ్రాన్. కశ్మీర్ ప్రజలకు ఎప్పుడూ మద్దతుగా ఉంటామని వ్యాఖ్యానించారు. వారికోసం పోరాడుతూనే ఉంటామన్నారు. అదే సమయంలో పాక్ మిలటరీ కూడా ఇమ్రాన్ వ్యాఖ్యలకు వత్తాసు పలికింది. భారత సైన్యం దాడులను సమర్థవంతంగా అడ్డుకుంటామని పేర్కొంది.