డ్రోన్‌ను తలపించే ఫ్లయింగ్ ట్యాక్సీ (హోవర్ ట్యాక్సీ)నిసింగపూర్లో విజయవంతంగా పరీక్షించారు. జర్మనీ సంస్థ వోలోకాప్టర్ తయారుచేసిన ఈ ట్యాక్సీ.. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమయ్యే ఆసియా నగరాల్లో ఈ ఫ్లయింగ్ ట్యాక్సీ విప్లవాత్మక మార్పులు తెస్తుందని వోలోకాప్టర్ భావిస్తోంది.
టెస్ట్ ఫ్లైట్‌లో 18 ప్రొపెల్లర్లు ఉన్న ఈ హోవర్ ట్యాక్సీ.. ప్రొమోంటరీ నుంచి బయలుదేరి మెరినా బే చుట్టూ రెండు నిమిషాల 30 సెకెన్ల పాటు ప్రయాణించింది.
డ్రోన్ సాంకేతికత
హోవర్ ట్యాక్సీలు చిన్న హెలికాప్టర్లను పోలి ఉంటాయి. కానీ ఇవి డ్రోన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటాయి. ఇవి స్వయంచాలకంగా పనిచేస్తాయి. అయితే పరీక్ష సమయంలో భద్రత కారణాల రీత్యా పైలట్‌ను వినియోగించారు.
వోలోకాప్టర్ ఇప్పటికే దుబాయ్, హెల్సింకీ, జర్మనీ, లాస్వెగస్ల్లో ఈ పరీక్షలు నిర్వహించింది. సింగపూర్‌లో ఈ పరీక్షలు జరపడం మాత్రం ఇదే మొదటిసారి. మరో రెండు నుంచి నాలుగు ఏళ్లలో వాణిజ్యపరంగా ఈ హోవర్ ట్యాక్సీలు అందుబాటులోకి తెచ్చేందుకు వోలోకాప్టర్ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఆసియా దేశాల్లో వీటిని ప్రవేశపెట్టాలని భావిస్తోంది.